Zarifa Ghafari: కలలు మరణిస్తాయా?

Afghanistan First Female Mayor Waiting For Taliban To Come And Kill Me - Sakshi

అఫ్ఘాస్తాన్‌లో ఒక మహిళా మేయర్‌ ‘నేను వారి రాకకై ఎదురు చూస్తున్నాను. నా చావుకై ఎదురు చూస్తున్నాను’ అంది. ఆ దేశ విద్యాశాఖామంత్రి అయిన మహిళ ‘నేను ఏ తప్పూ చేయలేదు. నా భవిష్యత్తు తెలియదు’ అంటోంది. వారిద్దరే కాదు అఫ్ఘానిస్తాన్‌లో లక్షలాది స్త్రీలు, బాలికలు తమ భవిష్యత్తు మీద బెంగతో కన్నీరుమున్నీరవుతున్నారు. తాలిబన్‌ పాలనలో గతంలో వారు చాలా నిర్బంధం అనుభవించారు. ఈసారి కూడా అదే జరిగితే ఏదో సాధించాలనే తమ కలలు మరణించక తప్పవని అంటున్నారు.

గత ఇరవై ఏళ్లలో అఫ్ఘానిస్తాన్‌లో స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడారు. విద్యా హక్కు కోసం, ఉపాధి హక్కు కోసం మతం లోపల, ప్రభుత్వంతో పోరాడారు. అక్కడ పార్లమెంట్‌లో కూచోగలిగారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రపతి పదవికి కూడా ఒక మహిళ పోటీ చేసి ఓడిపోయింది. చైనాలో అఫ్ఘాన్‌ ప్రభుత్వం తాలిబన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పుడు తాలిబన్లతో తమ వాదన వినిపించేందుకు ముగ్గురు ఆఫ్ఘాన్‌ మహిళా హక్కుల కార్యకర్తలు హాజరయ్యి వార్తలు సృష్టించారు. స్త్రీలకు సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడుతున్న సందర్భంలో హటాత్తుగా అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలు మారిపోయాయి. ఆ దేశం తాలిబన్ల వశం అయ్యింది. చరిత్ర పునరావృత్తం అవుతుందేమోనని భయవిహ్వలత అక్కడి స్త్రీలలో వ్యాపించింది.

బట్టలు కొనుక్కోవాలి
ఆగస్టు రెండోవారంలో తాలిబన్లు కాబూల్‌ వైపు వస్తూ ఉండగా కాబూల్‌లో ఉన్న స్త్రీలు, పిల్లలు ఏదో ఒక ఆశ పెట్టుకునే ఉన్నారు. కాని తాలిబన్లు అందరూ ఊహించిన దాని కంటే వేగంగా ఆగస్టు 15న కాబుల్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆష్రాఫ్‌ ఘని ప్రజలను వారి ఖర్మానికి వదిలిపెట్టి దేశం విడిచి పారిపోయాడు. ఆగస్టు 15న కాబూల్‌లోని స్త్రీలు, మహిళలకు చీకటి రోజు. టీచర్లు, ఉద్యోగినులు, విద్యార్థినులు... తమ భవిష్యత్తు తెలియక అగమ్యగోచరం అయ్యారు. ముఖ్యంగా వారంతా నిండుగా శరీరాన్ని కప్పి ఉంచే బురఖాల కోసం రోడ్ల మీదకు పరిగెత్తారు.

తాలిబన్లు స్త్రీల దుస్తుల విషయంలో నిరంకుశంగా ఉంటారు. ‘పాదాలు నగ్నంగా కనిపించే శాండల్స్‌ వేసుకున్నా వారు సహించరు’ అని ఒక విద్యార్థిని అంది. ఆ సమయంలో మార్కెట్‌లో దుకాణాలు మూతపడ్డాయి. మార్కెట్లు మూతపడ్డాయి. రోడ్డు మీద పిట్ట లేదు. స్త్రీలు దిక్కుతోచక పబ్లిక్‌ పార్క్‌కు చేరారు. భవిష్యత్తుకు సంబంధించిన బెంగ ఒకటి. తాలిబన్లు ‘నిఖా’ కోరితే కాదనలేని పరిస్థితి ఒకటి. నిజంగా ఇది భయానకం.

నేను విద్యా శాఖా మంత్రిగా బాగానే పని చేశాను. ఎవరికీ ఏ నష్టం కలిగించలేదు. నేను నా మంత్రి పదవి వల్ల తాలిబన్ల చేతిలో శిక్ష అనుభవించననే అనుకుంటున్నాను. కాని ఏం జరుగుతుందో చెప్పలేను.

– రంగిన హమీది, విద్యాశాఖ మంత్రి

ప్రపంచమా... స్పందించు...
తాలిబన్లకు కాబూల్‌ హస్తగతం కావడంతోటే అక్కడి మహిళా దర్శకురాలు సహ్రా కరిమి కెమెరా తీసుకొని రోడ్డు మీద పడింది. కాబూల్‌ దృశ్యాలు చిత్రించి పోస్ట్‌ చేస్తూ ‘ఇది సినిమాలో భయానక సన్నివేశం కాదు. నిజ దృశ్యం’ అని రాసింది. ‘ప్రపంచమా దయచేసి మౌనంగా ఉండకు... వాళ్లు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు’ అని ఆమె పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. విశేషం ఏమిటంటే గత వారమే కాబూల్‌లో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఇప్పుడు కళల పట్ల, సినిమాల పట్ల తాలిబన్ల వైఖరి ఏమిటనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే వారు మొదటిసారి పాలన చేసినప్పుడు (1996–2001) స్త్రీలను చాలా నిర్బంధంలో పెట్టారు. చదువుకు, క్రీడలకు, ఉద్యోగాలకు చివరకు ఒంటరిగా తిరగడానికి కూడా  నిబంధనలు విధించారు. అవన్నీ ఇప్పుడు అక్కడి స్త్రీలకు పీడకలలు ఇస్తున్నాయి.

చరిత్రలో మేము నశిస్తాం
తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంతోటే ఇరానియన్‌ జర్నలిస్ట్‌ మాసి అలినెజాద్‌ పోస్ట్‌ చేసిన ఒక బాలిక వీడియో ప్రపంచాన్ని కదిలించింది. ‘మేము అఫ్ఘానిస్తాన్‌ వాళ్లం కనుక లెక్కలో లేము. మేము మెల్లగా చరిత్రలో నశిస్తాం’ అని ఆ బాలిక కన్నీరు కార్చింది. ఇక తైక్వాండో దివ్యాంగ క్రీడాకారిణి జకియా ఖుదాదదీ బాధ మరొకటి. ఆమె సెప్టెంబర్‌ 5న టోక్యోలో జరగనున్న పారా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు తాలిబన్ల రాకతో ఆమె నెత్తిన పిడుగు పడింది. ఆమె టోక్యోకు వెళ్లే వీలు ఏ కోశానా లేదు. గత ముప్పై ఏళ్ల అఫ్ఘాన్‌ చరిత్రలో మొదటిసారి ఒక మహిళ విద్యాశాఖ మంత్రి అయ్యింది. ఆమె పేరు రంగిన హమీది. ఆమె తన భవిష్యత్తు గురించి ఉత్కంఠతో ఉంది. ‘నేను విద్యా శాఖా మంత్రిగా బాగానే పని చేశాను. ఎవరికీ ఏ నష్టం కలిగించలేదు. నేను నా మంత్రి పదవి వల్ల తాలిబన్ల చేతిలో శిక్ష అనుభవించననే అనుకుంటున్నాను. కాని ఏం జరుగుతుందో చెప్పలేను’ అందామె. 

ఏం చెబుతున్నారు?
తాలిబన్లు స్త్రీలను సాధారణ జీవనం గడిపమని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు 12 ఏళ్ల తర్వాతి వయసు బాలికలకు చదువు నిరాకరిస్తారని, మహిళలకు ఉద్యోగ హక్కు తీసి వేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్న హిందువులు, క్రైస్తవులకు తాలిబన్‌ నేతలు అభయం ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి. ఏదైనా ఒక అస్పష్ట చిత్రమే ఇప్పుడు. రెండు లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి ర్యాంకు సాధించి, గతంలో ఐ.ఎస్‌.ఐ.ఎస్‌ బాంబు అటాక్‌ జరిగితే 40 మంది విద్యార్థినులు చనిపోగా బతికి బట్ట కట్టి ‘అఫ్ఘా్ఘన్‌ మలాలా’గా బిరుదు పొందిన షంషియ అలిజాదా తాను డాక్టర్‌ కావాలని కన్న కల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తోంది. ‘నేను ఆశ కోల్పోను. పోరాడతాను’ అని కూడా అంటోంది.

అఫ్ఘానిస్తాన్‌లో ఏకైక మహిళా మేయర్‌ జరీఫా గఫారి దిక్కు తోచని స్థితిలో ఉంది. రెండేళ్ల క్రితం మేయర్‌ అయిన జరీఫా ఈ రెండేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. గుర్తింపు పొందింది. ‘ఇవాళ నేను నా భర్త, పిల్లలతో తాలిబన్ల రాక కోసం ఎదురు చూస్తున్నాను. మాకు సాయం చేసేవారు ఎవరూ లేరు. వాళ్లు నాలాంటి దాన్ని వెతుక్కుంటూ వస్తారు. పారిపోవాలంటే ఎక్కడికి వెళ్లను’ అని అందామె. కాని ఆగస్టు 15 నాటి అఫ్ఘాన్‌ అరాచకం అదుపులోకి వస్తుందా, రాబోయే కొన్ని రోజులలో తాలిబన్ల తాజా వైఖరి ఏమిటో తెలుస్తుందా? వాళ్లు వాళ్ల ప్రజలనే బాధలు పెట్టే కఠోరులవుతారా? లేక ప్రపంచం కోసమైనా కొన్ని సడలింపులు ఇస్తారా? కాలమే చెప్పాలి. అందాక స్త్రీలు తీవ్రమైన ఒత్తిడిని, వేదనను మాత్రం ఎదుర్కొన తప్పదు.

మేము అఫ్ఘానిస్తాన్‌ వాళ్లం కనుక లెక్కలో లేము. మేము మెల్లగా చరిత్రలో నశిస్తాం.


– అఫ్ఘాన్‌ బాలిక 


తైక్వాండో దివ్యాంగ క్రీడాకారిణి జకియా ఖుదాదదీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top