జిమ్‌ బామ్మ ఫ్రమ్‌ చెన్నై

83-Year-Old Woman In Chennai Is Workout, Fitness Icon On Social Media - Sakshi

వయసు 83. చేస్తుంది కసరత్తు. చెన్నైకి చెందిన కిరణ్‌బాయి తన మనవడి ప్రోత్సాహంతో హుషారుగా జిమ్‌ చేస్తూ ఆరోగ్యంలో.. బలంలో నాతో పోటీ పడగలరా అని సవాలు చేస్తోంది. వ్యాయామం ఏ వయసులో అయినా అవసరమే అని చెబుతోంది.

‘ఇదా... ఇదేముంది... వయసులో ఉన్నప్పుడు ఇనుప గుగ్గిళ్లు తిని అరాయించుకునేదాన్ని’ అంటుంది 83 ఏళ్ల కిరణ్‌బాయి చేతుల్లోని చెరి ఐదు కిలోల బరువున్న వెయిట్‌బార్స్‌ని పక్కన పెడుతూ. చైన్నై ఆర్‌.ఏ పురం లో నివాసం ఉండే కిరణ్‌ బాయి సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌. ఆమె జిమ్‌ వర్కవుట్స్‌ వీడియోలకు అభిమానులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉండే సహజమైన నిరాసక్తతగాని, నిర్లిప్తతగాని లేకుండా ఈ వయసులో శిథిలమవడమే శరీర ధర్మం అని వదిలిపెట్టేయకుండా ఆమె శరీరాన్ని బలసంపన్నం చేసుకుంటూ తద్వారా ఆరోగ్య స్ఫూర్తినిస్తోంది.

హుషారైన అమ్మాయి
చెన్నైలో పుట్టి పెరిగిన కిరణ్‌బాయి చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా చురుగ్గా ఉండేది. ఈత కొట్టేది. పెళ్లయ్యాక ఇంటి పనులన్నీ ఒంటి చేత్తో చేసేది. ‘మా రోజుల్లో మసాలాలు నూరేవాళ్లం. నీళ్లు పైకి కిందకి మోసేవాళ్లం. పశువుల పాలు పితికే వాళ్లం. ఇవన్నీ నేను ఉత్సాహంగా చేసేదాన్ని. అందుకే ఆరోగ్యంగా ఉండేదాన్ని’ అంటుంది కిరణ్‌ బాయి. ఆమె తల్లిగా మారినా, బామ్మ వయసుకు చేరినా అంతే ఉత్సాహంగా ఉండేది. ‘మా కాలనీలో నేను అందరి కంటే హుషారైన బామ్మని’ అంటుంది కిరణ్‌ బాయి.

2020లో మారిన కథ
అయితే ఇలా హుషారుగా ఉంటున్న కిరణ్‌ బాయి ఒకరోజు మంచం మీద నుంచి లేస్తూ కింద పడింది. ఆమె కాలు బాగా బెణికింది. ఆ సమయంలో ఆమెకు తన స్వభావానికి తగని నిర్లిప్తత వచ్చింది. నా జీవితం ముగింపుకు వచ్చేసింది... ఇక నేను ఎప్పటికీ మామూలు మనిషిని కాలేను అనే భావనకు వచ్చేసింది. ఆమె అలా డల్‌ కావడం గమనించిన కుటుంబ సభ్యులు చైన్నైలోనే ఆల్వార్‌పేటలో ఉంటున్న ఆమె మనవడు చిరాగ్‌కు పరిస్థితిని చెప్పారు. చిరాగ్‌కు సొంత జిమ్‌ ఉంది. సర్టిఫైడ్‌ జిమ్‌ ట్రైనర్‌ అతడు. ‘నువ్వు కొంచెం నానమ్మను దారిలో పెట్టరాదూ’ అని అడిగారు వాళ్లు.

బామ్మ కోసం మనవడు
చిరాగ్‌ ఆమె కోసం ఆమె ఇంట్లోనే తాత్కాలికమైన జిమ్‌ను ఏర్పాటు చేశాడు. కొద్దిపాటి పరికరాలతో ఇంట్లో ఉన్న వస్తువులతో అతడు తయారు చేసిన జిమ్‌లో వారానికి మూడు రోజులు ఆమె ఎలా వర్కవుట్స్‌ చేయాలో ఒక ప్రోగ్రామ్‌ ఇచ్చాడు. కిరణ్‌బాయి ముందు అనాసక్తిగా ఉన్నా తర్వాత వాటిని మొదలెట్టింది. సరిగ్గా మూడు నెలలు గడిచాయి. కిరణ్‌ బాయి మునుపటి కిరణ్‌బాయిగా మారిపోయింది. ఆమెకు శరీరం దారిలో పడింది. మనసుకు ఉత్సాహం వచ్చింది. మనవడితో కలిసి హుషారుగా వీడియోలు చేసింది. ఆ వీడియోలతో ఆమెకు పేరు వచ్చింది.

ప్రశంసలు... విమర్శలు
ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా చేశారు. ‘జిమ్‌ చేయడం వల్ల వృద్ధులలో కూడా కండరం శక్తిమంతం అవుతుంది. వాళ్ల ఎముకలు దృఢం అవుతాయి. శరీరం మీద బేలెన్స్‌ వస్తుంది. అంతే కాదు మెదడు కూడా చురుగ్గా తయారవుతుంది. మా బామ్మ ఇప్పుడు తను టాయిలెట్‌కు వెళ్లినా కింద కూచున్నా తనే లేవగలదు’ అంటాడు చిరాగ్‌.

చీరలోనే జిమ్‌
కిరణ్‌ బాయి తన మనవడు చెప్పినట్టుగా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా జిమ్‌ చేస్తుంది. తాను రోజూ కట్టుకునే చీరలోనే ఆ వ్యాయామాలన్నీ చేస్తుంది. జిమ్‌ పరికరాలతో కాకుండా కాళ్లతో సోఫా జరపడం, కుర్చీని కదల్చడం వంటివి కూడా చేస్తుంది. ‘నా పనులు నేను చేసుకోలేనేమోననే భయం నాకు పోయింది’ అంటుంది కిరణ్‌ బాయి. ఆమె వీడియోలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ వయసులో ఉన్నవారిని ఉత్సాహ పరుస్తున్నాయి.

‘ఈ వయసులో ఇంత పేరా బామ్మా’ అని అడిగితే ‘అంతా నా మనవడి దయ’ అని మనవడికి ముద్దు పెడుతుంది. ఆమె ఆ మనవడికి సరిగానే పేరు పెట్టింది. ‘చిరాగ్‌’ అని. చిరాగ్‌ అంటే వెలుతురు అని అర్థం. ఉత్సాహ పరిచే పిల్లలు, మనవలు ఉంటే వృద్ధాప్యంలో ఉన్న ఎవరి జీవితాల్లో అయినా ఇలాంటి వెలుతురు సాధ్యమే.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top