లేడీస్ వితౌట్ మెహ్రమ్
హజ్ యాత్ర చేసేందుకు స్త్రీలు ‘మెహ్రమ్’ పాటించాలి. ‘మెహ్రమ్’ అంటే ఏ విధంగా చూసినా వివాహానికి వీలులేని బంధుత్వం ఉన్న పురుషుడి తోడు. అయితే ఒంటరి స్త్రీలు, వితంతువులు, పిల్లలు దగ్గర లేని వారు హజ్ చేసే హక్కు కలిగి ఉన్నారని భారత ప్రభుత్వం, సౌదీ గుర్తించాయి. 45 ఏళ్లు పైబడ్డ స్త్రీలు 2023 నుంచి మెహ్రమ్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి అనుమతి దొరికింది. ఈ సంవత్సరం మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 5,446 మంది స్త్రీలు ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ హజ్ యాత్ర చేస్తున్నారు. హజ్ చేయాలనుకునే స్త్రీలకు ఇది స్ఫూర్తి.
మే 25 నుంచి మే 30 వరకూ హజ్ ప్రధాన రోజులు. అందుకే దేశంలో హజ్ యాత్రికులు ప్రయాణ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఏప్రిల్ 18న మొదటి హజ్ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ సంవత్సరం మన దేశం నుంచి మొత్తం లక్షా డెబ్భై ఐదువేల మంది హజ్ యాత్ర చేస్తున్నారు. అయితే వీరిలో ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ విభాగం కింద 5,446 మంది మహిళలు ఉండటం విశేషం. వీరిలో మళ్లీ అత్యధికంగా కేరళ నుంచి 4,477 మంది అనుమతి పొందడం మరో విశేషం.
మెహ్రమ్ అంటే?
హజ్ యాత్రకు వెళ్లే ఆడవారితో పాటు తప్పకుండా వెళ్లాల్సిన మగతోడుని ‘మెహ్రమ్’ అంటారు. ఇస్లాం ప్రకారం ఎప్పటికీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేని దగ్గరి బంధువు (తండ్రి, కన్నకొడుకు, అన్న, తమ్ముడు, తాత, మనవడు, బాబాయి, మేనల్లుడు) మెహ్రమ్ గా వెళ్లవచ్చు. భర్త తోడు వస్తే ఇక ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు. ఆ రోజుల్లో స్త్రీల భద్రత కోసం ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఎడారి ప్రయాణంలో స్త్రీల రక్ష కోసం, కొత్త ప్రాంతంలో వారు ఆందోళన చెందకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాలం మారినా, ఆధునిక సురక్షిత పద్ధతులు వచ్చినా మెహ్రమ్ వీలు కాని స్త్రీలు హజ్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చేది.
2023 నుంచి మార్పు
మన ప్రభుత్వం 2018 నుంచి 45 ఏళ్లు పైబడిన స్త్రీలు నలుగురేసి చొప్పున గ్రూప్‌గా హజ్ యాత్ర చేయవచ్చని సడలింపు చేసింది. అయితే 2023 నుంచి సౌదీ అరేబియా అధికారికంగా ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ను వెసులుబాటు కల్పించింది. దాంతో 2023 నుంచి మన దేశంలో ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ పేరుతో స్త్రీలు హజ్ యాత్రను చేస్తున్నారు. కేరళ నుంచి 2023లో పెద్ద సంఖ్యలో స్త్రీలు ఈ విభాగం కింద హజ్ యాత్ర చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వీరి సంఖ్య ఈ సంవత్సరం పెరిగింది. 45 ఏళ్ల లోపు స్త్రీలు హజ్ చేయాలంటే ఇప్పుడూ ‘మెహ్రమ్’ తప్పనిసరి.
జుబేదా ముహమ్మద్ కల నెరవేరింది
మలప్పురంకు చెందిన 58 ఏళ్ల జుబేదా మహమ్మద్‌కి ఎన్నో ఏళ్లుగా ఒకటే కల. భర్త చేయి పట్టుకుని హజ్ యాత్ర చేయాలి. కానీ విధి వేరేలా రాసింది. 2019లో భర్త హఠాత్తుగా గుండె పోటుతో కన్నుమూయడంతో ఆమె హజ్ కల సమాధి అయ్యింది అనుకున్నారు అందరూ. ‘ఆడదానివి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తావ్? మెహ్రమ్ లేకుండా హజ్ కుదరదు’ అని చుట్టాలు, బంధువులు చె΄్పారు. కొడుకులు విదేశాల్లో ఉన్నారు. ఇంట్లో ఒంటరి. కానీ 2023లో ఒక వార్త ఆమె జీవితాన్ని మార్చేసింది. భారత ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వం కలిసి 45 ఏళ్లు పైబడిన మహిళలు నలుగురు గ్రూప్‌గా మెహ్రమ్ లేకుండా హజ్‌కి వెళ్లొచ్చు అని ప్రకటించాయి.
కొడుకులకు జుబేదా ఒక్కటే చెప్పింది – ‘మక్కాకు వెళ్లకుండా నేను కళ్లు మూయలేను. నా భర్త ఆత్మ శాంతించదు’ అని. హజ్ ఖర్చు దాదాపు 4 లక్షలు. భర్త పెన్షన్, కొంత పొదుపు, కొడుకులు పంపిన డబ్బు కలిపింది. వైద్య పరీక్షలు, వ్యాక్సిన్లు, పాస్ పోర్ట్, శిక్షణా తరగతులు – అన్నీ ఒంటిచేత్తో చేసుకుంది. ‘రాత్రిళ్లు మోకాళ్ల నొప్పులతో ఏడ్చేదాన్ని. కానీ కాబాను తలచుకుంటే నొప్పి మాయం అయ్యేది’ అందామె. విమానం జెద్దా ఎయిర్ పోర్టులో దిగగానే కళ్లలో నీళ్లు. 40 ఏళ్ల కల నెరవేరిన క్షణం. హజ్ చేసి వచ్చాక జుబేదా మాటలు ఇవి: ‘ఒంటరిని అని భయపడకండి. ప్రభుత్వం దారి ఇచ్చింది. నలుగురు తోడు దొరుకుతారు. అడుగు ముందుకు వేయండి. కాబా మిమ్మల్ని పిలుస్తోంది.’


