
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిన్ డినైడ్’ అనేది న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ కొన్ని కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మానవ వనరుల లేమి, మౌలిక వసతుల కొరత సహా అనేక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న కుషాయిగూడ పోలీసుస్టేషన్‌లో 2001 ఫిబ్రవరిలో నమోదైన ‘భారీ దొంగతనం’ కేసు విచారణ కోర్టులో 24 ఏళ్లు సాగింది. చివరకు 2025 ఏప్రిల్ 2న వీగిపోయింది. ఈ కేసులో పదిమంది నిందితులు ఉండగా, కోర్టు తీర్పు వెలువడే నాటికి ఐదుగురు చనిపోయారు.
అది కుషాయిగూడలోని కమలనగర్ ప్రాంతం. అక్కడి శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో ఎ.కృష్ణమూర్తి అనే వ్యాపారి ‘రూప క్లాత్ ఎంపోరియం’ పేరుతో వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. విక్రయాల కోసం పనివాళ్లను ఏర్పాటు చేసుకోకుండా, స్వయంగా నిర్వహణ బాధ్యతలు చూసుకునే వారు. నాటి వ్యాపార వేళలు నేటికి భిన్నంగా ఉండేవి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటలకే వస్త్ర దుకాణాలు తెరుచుకునేవి. ఎప్పటిలాగే 2001 ఫిబ్రవరి 16 ఉదయం ఆయన తన షాపు తెరిచారు. ఆ వెంటనే తన దైనందిన కార్యకలాపాల్లో ముగినిపోయారు. ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు ఉదయం 11 గంటలకే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావడం ప్రారంభమైంది. దీంతో ఆ రోజు తన పంట పండిందని భావిస్తూ కస్టమర్లకు స్వాగతం పలికారు. అలా వచ్చిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
ఎవరికి వారు తమకు కావాల్సిన వస్త్రాలను చూపించాలని కోరడంతో దుకాణం మొత్తం హడావుడి నెలకొంది. అయితే చివరకు కృష్ణమూర్తి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు.కస్టమర్లు వెళ్లిపోయాక వారికి చూపించడానికి బయటకు తీసిన వస్త్రాలన్నింటినీ కృష్ణమూర్తి సర్దుకోవడం మొదలెట్టారు. అప్పుడు స్టాకులో తేడా రావడాన్ని గమనించి, దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపు తెరిచిన వెంటనే కొనుగోలుదారులుగా వచ్చిన వాళ్లల్లో ఎవరో తస్కరించినట్లు అనుమానించారు. దుకాణం మూసి బయటకు వెళ్లిన కృష్ణమూర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేరుగా కుషాయిగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడంటే ఏదైనా ఓ నేరం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్, నిందితులు వినియోగించిన సెల్ నెంబర్, ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్ల పైనే పోలీసుల దృష్టి పడుతోంది. సీసీ కెమెరాలు లేని, సెల్‌ఫోన్లు అంతగా వినియోగంలోకి రాని రోజులు కావడంతో సంప్రదాయ దర్యాప్తు విధానాలతోనే ముందుకు వెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నగరంలోని పాత నేరగాళ్ల వివరాల ఆరా తీశారు. ఇలాంటి నేరాలు గతంలో చేసిన వాళ్లు ఎవరెవరు? ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు వేగులకూ పని చెప్పారు.
నేరం జరిగిన తీరును బట్టి వ్యవస్థీకృత నేరగాళ్ల పనిగా భావించారు. ఇలాంటి వాళ్లు పదేపదే నేరాలు చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలోని అన్ని వస్త్రదుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. కుషాయిగూడ పోలీసులు తీసుకున్న ఈ చర్య ఫలితాన్ని ఇచ్చింది. రూప క్లాత్ ఎంపోరియంలో చోరీ జరిగిన వారం రోజులకు మరో వస్త్ర దుకాణాన్ని టార్గెట్ చేసిన ముఠాలోని కొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ షాపులో బేరసారాలు చేయడం మొదలెట్టారు. వీరి వ్యవహారశైలి, వస్త్రధారణ, నేరం చేసే తీరు తదితర అంశాలపై పోలీసులు ప్రచారం చేసి ఉండటంతో ఆ దుకాణం యజమాని గుర్తించాడు. వెంటనే స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఆ నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. రూప క్లాత్ ఎంపోరియంలోకి తమతో పాటు వచ్చి, నేరంలో పాలుపంచుకున్న అనుచరుల వివరాలను బయటపెట్టారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మొత్తం పది మందిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని లంబాడికుంట తండాకు చెందిన ఈ పదిమంది వ్యాపారి కృష్ణమూర్తి దృష్టి మరల్చి చోరీ చేసినట్లు తేల్చారు. ఆధారాలు సేకరించిన కుషాయిగూడ పోలీసులు న్యాయస్థానంలో అదే నెల 28న అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో బెయిల్ పొందిన నిందితులు జైలు నుంచి బయటకు రాగా, కొన్నాళ్లకు కేసు విచారణ ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల 2025 ఏప్రిల్ 2 వరకు దీని విచారణ కొనసాగింది.
ఈ కేసు దర్యాప్తు సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా (ఎస్సై) ఉన్న అధికారి పదోన్నతుల తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) హోదాలో కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 2001లో నిందితుల కోసం గాలించిన పోలీసులు కొన్నాళ్లకు ఫిర్యాదుదారుడైన కృష్ణమూర్తి, ఇతర సాక్షుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో వీరు చెప్పే సాక్ష్యాలు అత్యంత కీలకం. అయితే కేసు విచారణ కీలక దశకు చేరుకునే సరికి కృష్ణమూర్తి తన వ్యాపారం మానేశారు. శ్రీసాయి అపార్ట్‌మెంట్స్‌తో పాటు అప్పట్లో ఆయన నివసించిన ఇంటి వద్దకూ వెళ్లిన పోలీసులు కృష్ణమూర్తి వివరాల కోసం ఆరా తీశారు.
ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, కృష్ణమూర్తితో పాటు ఇతర సాక్షుల ఆచూకీ లభించలేదు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడితో (ఏ–1) పాటు మూడు, నాలుగు, ఐదు, పదో నిందితులు చనిపోయారు. మిగిలిన ఐదుగురిపై తుది వరకు విచారణ సాగినా, చివరకు కేసు వీగిపోయింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసులో కృష్ణమూర్తి దుకాణం నుంచి చోరీ అయినవి ఏంటో తెలుసా? ఐదు తానుల కాటన్ వస్త్రం, మూడు లంగాలు, ఒక రవిక ముక్క. కుషాయిగూడ పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో వీటి విలువ రూ.8 వేలు.