పెళ్లింట భారీ చోరి.. 2 కోట్ల‌కు పైగానే

Watchmen Committed A Massive Theft Worth Over 2  Crores Of jewellery - Sakshi

సాక్షి, కుషాయిగూడ : ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. వివ‌రాల ప్ర‌కారం.. సైనిక్‌పురి డిఫెన్స్‌ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది.  ఆయ‌న చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు.  (పంగోలిన్‌ చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు)

రిసెప్షన్లో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్‌ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్‌ తాళాలు పగులగొట్టి వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం స‌హా 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో  రికార్డు అయ్యాయి.  

 రిసెప్షన్ అనంత‌రం అక్క‌డికి చేరుకున్న కుటుంబ‌స‌భ్యులు వ‌స్తువుల‌న్నీ చింద‌రవంద‌ర‌గా ప‌డి ఉండ‌టంతో చోరికా గుర‌య్యాయ‌ని గుర్తించారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  మల్కాజిగిరి   డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌తోపాటు డాగ్‌స్క్వాడ్‌తో  ఘటనాస్థలానికి చేరుకున్నారు.  చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు    డీసీపీ పేర్కొన్నారు. (భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top