
మధ్యప్రదేశ్‌లో 15 రోజుల్లో 6 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం కలకలం రేపింది. మొదట అందరూ సీజనల్ ఫీవర్స్ వేవ్ అనుకున్నారు. కానీ ఆ తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెండు రకాల కాఫ్ సిరప్‌ను నిషేధించారు. ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాను కుదిపేసిన హృదయ విదారక విషాదంలో, గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి సీజనల్ జ్వరాలు అనుకొని చికిత్ర చేశారు. కానీ పరిశోధకులు మరో విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషపూరిత డైథిలిన్ గ్లైకాల్‌తో కలిపిన కలుషితమైన దగ్గు సిరప్ మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో రెండు రకాల దగ్గు మందులను బ్యాన్ చేశారు.
ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు మొదట జలుబు, తేలికపాటి జ్వరంతో వైద్యులను సంప్రదించారు. స్థానిక వైద్యులు దగ్గు సిరప్‌లతో సహా సాధారణ మందులను సూచించారు. ఆ తర్వాత పిల్లలు కోలుకున్నట్లు అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరం తిరగ బెట్టింది. మూత్ర బంద్ అయిపోయింది. ఆ తరువాత పరిస్థిత మరింత తీవ్రమై మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌గా మారింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి."మా పిల్లలు ఇంతకుముందెప్పుడూ అనారోగ్యంతో బాధపడ లేదని, దగ్గు సిరప్ తీసుకున్న తరువాతే మూత్రం ఆగిపోయిందని’’ కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.(సెంటర్‌స్టోన్ డైమండ్‌రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?)
మృతుల కిడ్నీ బయాప్సీలలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. చాలా మందికి బాధితులకు కోల్డ్‌రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ సిరప్‌లు ఇచ్చారు. చింద్వారా కలెక్టర్ షీలేంద్ర సింగ్ వెంటనే జిల్లా అంతటా రెండు సిరప్‌ల అమ్మకాలను నిషేధించారు. వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు అత్యవసరమైన కీలక సూచనలు జారీ చేశారు. మూత్రపిండాల వైఫల్యానికి కలుషితమైన ఔషధం కారణమని బయాప్సీ నివేదికలో తేలిందని ప్రభావిత గ్రామాల నుండి నీటి నమూనాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి ఒక బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నామని సింగ్ అన్నారు. "సెప్టెంబర్ 20 నుండి, మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల సమస్యల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా మంది పిల్లలలో అకస్మాత్తుగా మూత్రపిండాల వైఫల్యం చాలా ప్రమాదకరమైందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే వెల్లడించారు. ఆగస్టు 24న మొదటి అనుమానిత కేసు నమోదైందని, సెప్టెంబర్ 7న మొదటి మరణం సంభవించిందని తెలిపారు.