యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలాన్ని మూడోసారి కూడా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం సచివాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. గత రెండు పర్యాయాలు సరైన లైసెన్స్ లేని కారణంగా అధికారులు వేలాన్ని వాయిదా వేశారు. ఈసారి గ్రామానికి చెందిన శిరిగినీడి శ్రీనివాస్ లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకురావడంతో వేలం రూ.13 లక్షలతో ప్రారంభించారు. రూ.7.50 లక్షల వరకు పాటను తగ్గించారు. అప్పటికీ పాట పాడకపోవడంతో పాటను శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ ప్రకటించారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది రేవు పాట రూ.3.47 లక్షలకు వెళ్లిందని, అంతవరకు తగ్గించి వేలం నిర్వహించాలని పట్టుబట్టారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా వేలాన్ని వాయిదా వేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాన్ని కొనసాగించాలని సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ శుక్రవారం వేలం తీరును చూస్తామని, అకారణంగా మరోసారి వాయిదా వేస్తే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


