ఎట్టకేలకు గిరిజన విద్యార్థుల బడి బాట | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు గిరిజన విద్యార్థుల బడి బాట

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

ఎట్టకేలకు గిరిజన విద్యార్థుల బడి బాట

బుట్టాయగూడెం : మండలంలోని పీఆర్‌గూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గురువారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టారు. సుమారు 28 రోజులపాటు మా బడి మాకే కావాలని పాఠశాల స్థాయి కుదింపు, రేషనలైజేషన్‌ను నిరసిస్తూ గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని విరమించడంతో పిల్లలు మళ్లీ బడిలో చేరారు. అయితే ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్‌ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ఆయా తరగతి గదులకు పంపించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల చదువులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు యు. ఏసుబాబు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మూలెం రమేష్‌, మడకం వెంకటేశ్వరరావు, బట్టు సురేష్‌ మాట్లాడుతూ 1986 నుంచి ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యి ఎంతోమంది విద్యార్థులకు చదువులు అందిస్తున్న తమ పాఠశాల రేషనలైజేషన్‌ పేరుతో 8, 9, 10 తరగతులు నిలిచిపోతున్నాయని తెలిసి ఎంతో ఆందోళన చెందామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలను కాపాడుకోవడం కోసం ఆందోళన చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌, ఏపీఎస్‌ ఆర్‌టీసీ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పల నాయుడుల సమక్షంలో పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి పాఠశాలను యధాతథంగా కొనసాగించేందుకు జరిగిన చర్చలు ఫలప్రదంకావడంతో తిరిగి పాఠశాలలను ప్రారంభించేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. అలాగే పాఠశాలలో నూటికి నూరు శాతం విద్యార్థులు చేర్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పారు. అలాగే తమపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని పీఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మడకం పాపాయమ్మ, పొడియం వసంత, బన్నే పూర్ణ, లక్ష్మీనారాయణ, డీవైఈఓ రవి ప్రసన్న కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement