స్పందన
పాలకొల్లు సెంట్రల్ : ఉదయం బాలభవన్... సాయంత్రం క్లబ్ పార్కింగ్ శీర్షికతో గత నెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, క్లబ్ సభ్యులు స్పందించారు. బాలభవన్ ప్రహరీగోడను ఇష్టానుసారంగా పగులగొట్టి, ఆ స్థలాన్ని క్లబ్ సభ్యులు పార్కింగ్‌కు వాడుకుంటున్న తీరుపై సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై బాలభవన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. క్లబ్ ఆక్రమణలపై తక్షణమే పర్యవేక్షణ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు బాలభవన్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం క్లబ్ నిర్వాహకులను పిలిపించి గట్టిగా హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన క్లబ్ సభ్యులు.. గత రెండేళ్లుగా తాము పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్న బాలభవన్ స్థలాన్ని ఖాళీ చేశారు. అంతేకాకుండా, గతంలో పగులగొట్టిన ప్రహరీగోడను తిరిగి యథావిధిగా నిర్మించి బాలభవన్‌కు అప్పగించారు. ఈ వ్యవహారం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలభవన్‌కు చిన్నారులు శిక్షణా తరగతుల కోసం వస్తుంటారని, దానికి పక్కనే క్లబ్ నిర్వహించడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


