● 15న వైఎస్ జగన్ భీమవరం రాక
● ఏర్పాట్లను సమీక్షించిన నేతలు
● రైతులతో ముఖాముఖీ వేదికకు స్థల పరిశీలన
భీమవరం పర్యటనలో భాగంగా జగన్ ఆక్వా రైతులతో భేటీకానున్నారు. అందుకోసం ఉండి బైపాస్ రోడ్డులో అనువైన స్థలాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్, ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం పరిశీలించారు. ఏర్పాట్లుపై నాయకులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంట్ కార్యదర్శులు, ఎస్‌ఈసీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.
సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15న భీమవరం రానున్నారు. ఆక్వా సమస్యలపై ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేయనున్న వేదిక వద్ద రైతులతో నేరుగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన గురువారం భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పీఏసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉప్పల వాసుబాబు, వడ్డి రఘురామనాయుడు, చినమిల్లి వెంకట్రావు, గుడాల శ్రీహరిగోపాలరావు తదితరులు సమావేశమయ్యారు.
రైతుల ఆందోళనలు చంద్రబాబుకు పట్టవు
ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన వివరాలను అమర్నాఽథ్ మీడియాకు వివరించారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలు ఏకమై మేత ధరలు పెంచేసి, రొయ్య ధరలు తగ్గించేసి ఆక్వా రైతుల్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాయన్నారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. నాలుగైదు కంపెనీలకు ఆక్వా సంపదను దోచిపెట్టేందుకు లక్షలాది ఆక్వా రైతు కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులు వేటకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పొగాకు రైతులు, డెల్టాలో యూరియా దొరక్క వరి రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవేమీ చంద్రబాబుకు పట్టవన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తే గొడ్డలంటాడు, తల్లంటాడు, చెల్లంటాడే తప్ప ప్రజాసమస్యల్ని ఏరకంగా పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి గడువిచ్చినప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల పక్షాన పోరాటానికి జగన్ భీమవరం వస్తున్నారన్నారు. ఉండి బైపాస్ రోడ్డులో రైతులతో ముఖాముఖీగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని అమర్నాథ్ తెలిపారు.
పేర్ని నాని మాట్లాడుతూ విద్య, ఆక్వా తదితర అన్ని రంగాల్లో తన వాళ్లకి దోచిపెట్టడం లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ ఉన్న తీరప్రాంతం మొత్తం ప్రజలు చేపలు, రొయ్యల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరి కష్టాన్ని చంద్రబాబు ఫీడ్, సీడ్ కంపెనీలకు దోచిపెడుతున్నారన్నారు.
ఆక్వా చరిత్రలో తొలిసారి
జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఆక్వా చరిత్రలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం మొదటిసారి చూస్తున్నామ న్నారు. రాయితీ విద్యుత్, ధరల నియంత్రణతో జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకున్నారన్నారు. అంతకంటే ఎక్కువ మేలు చేస్తామంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు రైతుల నడ్డి విరిచారని విమర్శించారు. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ప్రసాదరాజు తెలిపారు.


