దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు | - | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

పెరిగిన ఎరువుల ధరలు

బస్తాపై రూ.300 నుంచి రూ.700 వరకు పెంపు

ఆందోళనలో అన్నదాత

నూజివీడు: ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఎరువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ప్రాథమికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. పంట ఎదుగుదలకు, దిగుబడికి అత్యంత కీలకమైన శ్రీకాంప్లెక్స్‌ ఎరువులశ్రీ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తమపై అదనపు భారం పడటమే కాకుండా పెట్టుబడి వ్యయం కూడా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం సహకరించక.. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు మద్దతు ధర లేక.. పెరిగిన సాగు ఖర్చులు సైతం చేతికందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడంతో మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా రైతన్న పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కెట్లో ఎరువులు సరిగా లభించడం లేదు. బ్లాక్‌ మార్కెట్లో అధిక డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. యూరియా కోసమైతే క్యూలో నిలబడాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురైంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడంతో పంటల సాగులో పెట్టుబడులు మరింత పెరుగుతాయని వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగిన మేర గిట్టుబాటు ధర పెరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా, డీఏపీ పాత ధరలే ఉన్నప్పటికీ కాంప్లెక్స్‌ ఎరువులు మాత్రం బస్తాకి రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి.

కాంప్లెక్స్‌ ఎరువులే కీలకం

పంటల దిగుబడిలో కాంప్లెక్స్‌ ఎరువులే కీలకమని రైతులు పేర్కొంటున్నారు. వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు ఈ ప్రాంతంలో సాగవుతాయి. యూరియా కేవలం పంట ఏపుగా పెరిగేందుకేనని, దిగుబడులు రావాలంటే నత్రజని, భాస్వరం, పొటాష్‌ మిళితమై ఉండే కాంప్లెక్స్‌ ఎరువులనే వాడతారు. వాటి ధరలను భారీగా పెంచేయడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎరువుల ధరలు ఇలా పెంచితే వ్యవసాయం చేయాలా, మానేసి కూర్చోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల ధరల పెంపు వల్ల రైతులపై కోట్లలో భారం పడనుంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఎరువుల ధరలు భారీగా పెంచడం వల్ల కౌలు రైతులు పెట్టుబడులు పెట్టలేక వ్యవసాయం చేయడం మానేసే ప్రమాదం నెలకొంది.

బస్తాకు రూ.700 వరకు పెరుగుదల

ఎరువుల ధరలు బస్తాకు రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి. బస్తాపై వందల్లో పెరగడంతో సాగుఖర్చు తడిసిమోపెడవుతోందని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం డీఏపీ, యూరియా ధరలను నియంత్రిస్తూ, రాయితీని భర్తిస్తోంది. భాస్వరం, పొటాష్‌, కాంప్లెక్స్‌ ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకు వదిలేయడం సరి కాదన్నది రైతుల వాదన. ఎరువుల ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో రైతులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ లేకపోవడం దారుణమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎరువు రకం పాత ధర పెరిగిన ధర పెంపు

(రూ.ల్లో) (రూ.ల్లో) (రూ.ల్లో)

12–32–16 1900 2450 550

14–35–14 1900 2350 450

24–24–0 2000 2450 450

10–26–26 1950 2450 500

20–20–0–13 1550 2250 700

16–16–16 1675 2050 325

15–15–15–09 1650 1950 300

16–20–0–13 1400 2000 600

ఎంఓపీ 1850 1975 125

ఎస్‌ఎస్‌పీ 615 1000 385

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement