కారు బోల్తా | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

కారు బోల్తా మరో పాఠశాల గేటుకు తాళం వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడిపై 22న విచారణ విచారణాధికారిగా ఆర్‌డీఓ నిత్యాన్నదాన పథకానికి విరాళం

బుట్టాయగూడెం : మండలంలోని కండ్రికగూడెం సమీపంలో బుధవారం ఒక కారు బోల్తా పడింది. మండలంలోని కంసాలికుంటకు చెందిన తెల్లం రాకేష్‌, తన పిన్ని సుజాత, ఒక బాబు ముగ్గురూ నల్లజర్ల వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చిన్నపాటి కునుకురావడంతో గోతులోకి వెళ్లి తిరగబడిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బోల్తాపడిన కారును సమీపంలోని కొందరు బయటకు తీశారు.

బుట్టాయగూడెం : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని మారుమూల గ్రామమైన లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తాళాలు వేశారు. ఈ సందర్భంగా గేటు బయట బైటాయించి యథాతథంగా పాఠశాలలను కొనసాగించాలని నినాదాలు చేశారు. రేషనలైజేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి గ్రామాల్లో కూడా గ్రామస్థులు గత ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తరగతులు జరగకుండా అడ్డుకున్నారు. తాజాగా లంకపాకల పాఠశాలల కూడా తెరవకుండా తాళాలు వేయడంతో బుట్టాయగూడెం మండలంలోని మొత్తం 3 పాఠశాలల్లో విద్యాబోధన, అడ్మిషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. పాత పద్ధతిలోనే పాఠశాలలను కొనసాగించే వరకూ తెరవబోమని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కారం లక్ష్మి, పీడీఎస్‌యూ నాయకులు బన్నే వినోద్‌, ఎంపీటీసీ సభ్యుడు కొవ్వాసి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థాన అర్చకుడు ఎంఆర్‌ మంగపతి ఆచార్యులపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 22న విచారణ నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ ఏలూరు డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సురేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్చకుడి ప్రవర్తనపై అదే గ్రామానికి చెందిన వగ్వాల వెంకట భాస్కర్‌ అనే వ్యక్తి చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుపై దేవాదాయ శాఖ జిల్లా అధికారి కె.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు గుండుగొలను ఆలయ ప్రాంగణంలోనే విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణకు ఫిర్యాదీ వెంకట భాస్కర్‌తో పాటు అర్చకుడు మంగపతి ఆచార్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.

దెందులూరు: ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లిలో కలకలం సృష్టించిన నకిలీ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్ల వ్యవహారంలో.. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా, జాయింట్‌ కలెక్టర్‌ సంతకం లేకుండా మాన్యువల్‌గా ఈ సర్టిఫికెట్లు జారీ చేశారంటూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన లిఖితపూర్వక ఫిర్యాదుపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేశామని, ఆ నివేదికను కలెక్టరుకు అందజేస్తామని రూరల్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ రాజు తెలిపారు. కాగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 26న తమ కార్యాలయానికి హాజరుకావాలని రూరల్‌ మండలం రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ను ఆర్డీఓ ఆదేశించారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు భక్తులు వేరువేరుగా బుధవారం రూ.2,01,116 లను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన నిడుముక్కల గంగాధరరావు రూ.1,00,000 సమర్పించగా, ఏలూరుకు చెందిన పెద్ది శ్రీప్రియ రూ.1,01,116లను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు విరాళం బాండ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ నిత్యాన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న విరాళాలు అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు ఎంతో తోడ్పడుతున్నాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement