కూటమి సభలో నాయకుల రగడ | - | Sakshi
Sakshi News home page

కూటమి సభలో నాయకుల రగడ

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

భీమవరం : భీమవరం నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకుల్లో విభేదాల కుంపటి ఆరడం లేదు. ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్‌ రగడ జరుగుతోంది. బుధవారం భీమవరం బ్యాంక్‌ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీరెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమంశ్రీ పేరుతో కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రోటోకాల్‌ పాటించలేదంటూ రగడ సృష్టించారు. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ హవానే కొనసాగుతుందని జనసేనకు కనీసం గుర్తింపు లభించడంలేదనే ఆందోళన జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన అంజిబాబు పాత స్నేహితులు, సన్నిహితులైన టీడీపీ నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేన క్యాడర్‌ గుర్రుగా ఉన్నారు. భీమవరం పట్టణంతోపాటు, భీమవరం, వీరవాసరం మండలాల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. రెండేళ్ల నమ్మకం కార్యక్రమానికి మూడు పార్టీల నుంచి 8 మంది చొప్పున నాయకులను వేదికపైకి పిలవాలని వారిలో ఒక్కో పార్టీ నుంచి నలుగురు చొప్పున మాట్లాడే విధంగా నిర్ణయించారు. అయితే వేదిక పైకి పిలిచే సమయంలో టీడీపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంతమంది అలజడి సృష్టించడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. దీంతో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కలుగుచేసుకుని కార్యకర్తలు సమన్వయం పాటించాలని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు.

‘జనసేనలో కార్యకర్తలకు గుర్తింపు లేదు’

జనసేన పార్టీలో కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని జనసేన నాయకుడు, వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు విమర్శించారు. తరచూ పెద్ద నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారికి పదవులు ఇస్తున్నారని, ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేదికపై ఉన్న కొంతమంది నాయకులు కలుగుచేసుకుని ఇది పార్టీ కార్యక్రమం కాదని అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి అని అనడంతో నేను కార్యకర్తల గురించే మాట్లాడతానని కార్యకర్తలు లేకుంటే పార్టీ ఎక్కడదని స్పష్టం చేశారు. మొత్తం మీద రెండేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చెప్పుకునే కంటే కూటమి నాయకుల్లో విభేదాలే బయటపడడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement