జంగారెడ్డిగూడెం: దేవులపల్లి అంగన్‌వాడీ టీచర్ చీకట్ల వేదకుమారి శనివారం మధ్యాహ్నం అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మూడు నెలల క్రితం గుడ్లు పాడయ్యాయనే విషయమై గ్రామానికి చెందిన వారితో వివాదం జరిగిందని బాధితురాలు వేదకుమారి పేర్కొంది. ఆ తర్వాత గ్రామానికి చెందిన కొందరు తనను నిరంతరం వేధిస్తున్నారని తెలిపింది. ఉద్యోగం చేయనివ్వమని బెదిరించడం, కరెంట్ వైర్లు కత్తిరించడం, పోలీస్ స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులతో మానసిక క్షోభకు గురిచేశారని తెలియజేసింది. ఈ క్రమంలో జూన్ 13న తనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు వేదకుమారి చెప్పింది. ఒంటరి మహిళనైన తనకు ప్రాణ ముప్పు ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె అధికారులను వేడుకుంది. కాగా, విషయం తెలుసుకున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు.


