ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేస్తాం
ఉండి: ఉండి కాలువలో జాతీయ రహదారి రక్షణ కోసం చేపట్టిన రివిట్‌మెంట్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ద్వితీయార్ధంలో ప్రారంభమైన ఈ పనుల కోసం జాతీయ రహదారిని, పంట కాలువను అధికారులు మూసివేశారు. పనులు పూర్తిస్థాయిలో ముగిసి, రాకపోకలు యథావిధిగా సాగడానికి మరో నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉండి మండల శివారు, చెరుకువాడ సరిహద్దుల నుంచి ఆకివీడు మండలం అజ్జమూరు పరిధి వరకు ఈ రక్షణ గోడ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పనులు ప్రాథమిక దశ దాటి కొంత ముందుకు సాగినప్పటికీ, క్షేత్రస్థాయి సమస్యల వల్ల పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుంది.
మట్టి ఊటతో పనులకు ఆటంకం
ఒకవైపు పంట కాలువ, మరోవైపు ఆక్వా చెరువులు ఉండటంతో కాలువ తవ్విన ప్రాంతంలో చెరువుల నుంచి నీరు ఊరుతోంది. దీనికి తోడు కాలువ గట్టే చెరువు గట్టుగా ఉండటం, అధికారులు దీనిపై ముందస్తు శ్రద్ధ తీసుకోకపోవడంతో గట్టు జారి మట్టి తిరిగి కాలువలోకి వచ్చేస్తోంది. ఈ మట్టిని పదే పదే తొలగించాల్సి రావడం వల్లే రక్షణ గోడ పనులు మందగించాయని తెలుస్తోంది.
ప్రయాణికుల నరకయాతన.. అదనపు భారం
గతంలో ఉండిలో ఆర్‌ఓబీ నిర్మాణ సమయంలో రైల్వేగేటు కొన్ని రోజులు మూసివేస్తేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా జాతీయ రహదారినే మూసివేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.పనులు అనుకున్నట్లు జరిగితే ఈ నెల 20వ తేదీ నాటికి రహదారిని కొద్దిగా తెరుస్తామని అధికారులు చెబతున్నా అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనదారులు మాత్రమే మట్టి దిబ్బలు ఎక్కుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సాధారణ ప్రయాణికులు, ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఉండి, ఆకివీడు వైపుల నుంచి వచ్చేవారు పనులు జరిగే ప్రాంతం వరకు వచ్చి, కాలినడకన ఆ ప్రాంతాన్ని దాటి అవతలి వైపు మరో ఆటో ఎక్కాల్సి వస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు.
10 కిలోమీటర్ల మేర అదనపు ప్రయాణం
భీమవరం నుంచి ఆకివీడు మీదుగా కై కలూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లే కార్లు, ఇతర భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. భీమవరం నుంచి జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్లి, అక్కడ ఏలూరుపాడు వంతెన నుంచి ఐ.భీమవరం మీదుగా ఆకివీడు చేరుకుంటున్నారు. దీనివల్ల సాధారణ మార్గం కంటే సుమారు 10 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, సమయంతో పాటు ఇంధనం వృథా అవుతోందని వాహనదారులు వాపోతున్నారు.
సాగు, తాగునీటికీ ముప్పు
కాలువలకు నీరు విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నా.. చెరుకువాడ, దాని శివారు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగు, తాగునీరు అందడం లేదు. సాధారణంగా ఇక్కడి నుంచి ప్రవహించే నీరు అజ్జమూరు మురుగు కాలువలోకి వెళ్లాలి. కానీ, పనులు జరుగుతున్న ప్రాంతంలో అడ్డుకట్ట వేయడం వల్ల, ఉండి అక్విడెక్టు వద్ద పంట కాలువ నీటిని బొండాడ మేజర్ డ్రెయిన్‌లోకి విడిచిపెడుతున్నారు. ఫలితంగా కలిసిపూడి, చెరుకువాడ ప్రాంతాలకు నీటిమట్టం తగ్గి, పొలాలకు నీరందడం లేదు.
నాణ్యతపై అనుమానాలు..
ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించి కాలువలు మూసి ఉంచిన సమయంలోనే ఈ పనులు ప్రారంభించి ఉంటే.. నీటి విడుదలకు ముందే పనులు పూర్తయ్యేవి. ఒకవైపు రక్షణ గోడ కడుతుండగానే జాతీయ రహదారి కుంగిపోవడం, మరోవైపు ఆక్వా చెరువుల వల్ల గట్లు జారిపోతుండటంతో భవిష్యత్తులో ఈ కట్టడం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీరు ప్రవహిస్తున్న సమయంలోనే పనులు చేస్తుండటంతో రక్షణ గోడ నాణ్యతపై కూడా స్థానికులు పెదవి విరుస్తున్నారు.
ఉండి కాలువ రివిట్‌మెంట్ వాల్ నిర్మాణంలో తీవ్ర జాప్యం
మట్టి కొట్టుకుపోతుండటంతో మందగించిన పనులు
10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం
రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి మే మొదటి వారంలోనే మట్టి పరీక్షలు ప్రారంభించాం. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే పనులను వేగవంతం చేశాం. పనులు పూర్తిస్థాయిలో ముగియడానికి మరో నెల రోజులు పట్టవచ్చు. అయితే, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 నాటికి జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా పునరుద్ధరిస్తాం. పనులన్నీ త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– సబీరా సుల్తానా, ఎన్‌హెచ్ ఏఈ


