కాళ్ల: ఆకివీడు శివారు ఐ.భీమవరం రోడ్డులో ఉన్న దుంపగడప పంట బోదెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పంట బోదెలో 35 సంవత్సరాల వయసు ఉన్న పురుషుని మృతదేహం బోర్లా పడి ఉండడాన్నీ కనుగొన్నామన్నారు. నీలిరంగు ఫ్యాంటు, గోధుమ రంగు చారలు షర్టు కలిగి ఉన్నారని ఆయన వివరించారు. వెంకయ్య–వయ్యేరు కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి పంట బోదెలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
కామవరపుకోట: మండలంలో అంకాలంపాడు, కామవరపుకోట కోత్తూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి పొలాలలో బోరు మోటర్ కేబుల్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించి వెళ్లినట్లు రైతులు తెలిపారు. దీనిపై మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ వైర్లు సుమారు రూ.2 లక్షల రూపాయలు పైగా ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు, మోటర్ వైర్లు దొంగతనానికి గురైనట్లు రైతులు పేర్కొన్నారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఈ నెల 11న ఏలూరులో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు గోదావరి సమావేశపు హాలులో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్ 13న నరసాపురం వలందర్ రేవు వద్ద 1000 మందితో, జూన్ 14న వాసవి పెనుగొండలో 2500 మందితో, జూన్ 19న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మైదానంలో 1500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో 1500 మందితో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం విలేకరులకు ప్రజాప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఏలూరు టౌన్: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి బంగారం, సెల్‌ఫోన్ చేరీ చేసిన ఘటన మంగళవారం ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయినవీన్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. నవీన్ తన స్నేహితుడితో కలిసి దేవి బార్ అండ్ రెస్టారెంట్‌కు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం తాగుతున్న సమయంలోనే నవీన్‌కు అతడి స్నేహితునికి మద్య చిన్న వివాదం ఏర్పడటంతో బార్ నుంచి అతను వెళ్లిపోయాడు. నవీన్ ఒక్కడే బార్ నుంచి బయటకు వచ్చాడు. ఇదే సమయంలో మోటారు సైకిల్‌పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని అశోక్ నగర్‌లో దించుతామని చెప్పి ఎక్కించుకున్నారు. అయితే వారు చొదిమెళ్ల వైపు తీసుకువెళ్తూ గట్టిగా అరవకుండా నోరు మూసేశారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతూ వంగూరు వెళదామని చెప్పుకోవటం తాను విన్నానని నవీన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


