తవ్వేయ్‌.. తరలించేయ్‌..! | - | Sakshi
Sakshi News home page

తవ్వేయ్‌.. తరలించేయ్‌..!

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న యనమదుర్రు గ్రామంలో యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వి మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు తవ్వకాలు, స్థలాల పూడిక పనులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రొయ్యల చెరువుల తవ్వకాలకు అనుమతులు లేకపోవడమే గాక చెరువు తవ్విన మట్టిని స్థలాల పూడికకు అమ్మకాలు చేస్తూ కొంతమంది పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యనమదుర్రు గ్రామంలో ఇటీవల 13 ఎకరాల చెరువు తవ్వకం పనులు చేపట్టారు. గత నెల రోజులుగా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారు.

ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని..

యనమదుర్రు గ్రామంలో తవ్వుతున్న చెరువు మట్టిని భీమవరం పట్టణంలో స్థలాల పూడికకు తరలిస్తున్నారు. భారీ వాహనాలతో గ్రామంలోని మిండిపుంత నుంచి మట్టిని తరలిస్తున్నారు. స్థానిక అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ప్రజాప్రతినిధికి చెందిన వారికి మట్టి వెళ్తుందని, మీరు అడ్డంకి కలిగిస్తే ఇబ్బందులు తప్పవంటూ కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును తవ్వి మట్టి తరలించడం వల్ల మిండిపుంత రోడ్డు దెబ్బతిందని.. దాని వల్ల దాదాపు 300 ఎకరాల భూముల రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు పడడంతో సార్వా సీజన్‌లో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని వాపోతున్నారు. పుంతరోడ్డు వెంబడి ఉన్న నీటిపారుదల బోదె పూడిపోయిందని దీనితో సారునీరు ప్రవాహానికి ఆటంకం ఏర్పడి సాగుకు ఇబ్బందేనంటున్నారు. గ్రామంలో నుంచి భారీ వాహనాలు విచ్చల విడిగా వెళ్లడం వల్ల సీసీ రోడ్లు సైతం దెబ్బతినడమేగాక ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు

గత నెల రోజులుగా యనమదుర్రులో విచ్చలవిడిగా మట్టి తోలకంపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఇటీవల జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు అనుమతులు లేవని ల్యాండ్‌ కన్వర్షన్‌ లేకుండా వెంచర్స్‌ వేసి పంట పొలాలను ఇళ్లస్థలాలుగా పూడ్చివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులైనా మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేసి రోడ్డు ధ్వంసం కాకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు.

యనమదుర్రు గ్రామంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

Advertisement
 
Advertisement
Advertisement