తణుకు అర్బన్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వామపక్షాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ పెట్రల్, డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవనం దుర్భంరంగా మారుతుందన్నారు. దేశంలోని ప్రస్తుత దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గార రంగారావు, జి.గోపి, బండి సత్యనారాయణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కావడంతో ఆందోళనలో ఉన్న ఖాతాదారులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. జంగారెడ్డిగూడెంలో మంగళవారం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు వద్ద ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు బ్యాంకు వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం ఇప్పటికే రూ.కోటి విలువైన బంగారం మాయమైనట్లు తెలుస్తోందన్నారు. దీనిపై బ్యాంకు అధికారులు సమగ్ర విచారణ చేసి ఖాతాదారులకు న్యాయం చేయాలన్నారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్‌ఎం, పోలీస్ అధికారులతో మాట్లాడానని జెట్టి తెలిపారు. ఆర్‌ఎం స్పందిస్తూ ప్రస్తుతం బ్యాంకులో బంగారం రుణాలపై విచారణ జరుగుతోందని, ప్రతి ఖాతాదారుడికి న్యాయం చేస్తామని, ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యత అని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్, గగ్గల కిరణ్ కుమార్, జుత్తిగ ప్రసాద్, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్ పాల్గొన్నారు.


