జంగారెడ్డిగూడెం: చుక్కల దుప్పుల మాంసం అంటూ పంది మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ అధికారి వి.దుర్గాకుమర్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురం వద్ద సీమ పంది మాంసం విక్రయదారుడైన వల్లపు రాము ఇంటిని తనిఖీ చేయగా, అతని వద్ద రెండు చుక్కల దుప్పుల చర్మాలు, వాటి తలలు, కాళ్లు గుర్తించామన్నారు. వాటిని పశుసంవర్ధక శాఖ ఏడీ పీఎన్‌వీ శేఖర్ దొరతో పరీక్షలు నిర్వహించి దుప్పి అవశేషాలుగా నిర్ధారించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వల్లపు రామును కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కాగా రామును విచారించగా నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెంకు చెందిన దేవరకొండ ఏసు అనే వ్యక్తి చుక్కల దుప్పి చర్మాన్ని, తలలను, కాళ్లను తీసుకువచ్చి తనకు ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తల, చర్మం, కాళ్లను చూపించి, పంది మాంసాన్ని చుక్కల దుప్పి మాంసంగా మాంసాహార ప్రియులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపాడన్నారు. అలాగే ఈ అవశేషాలను నిందితుడు రాము ఫ్రిడ్జ్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారి పి.ధర్మారావు, బీట్ అధికారి పోలుపర్తి నాగవేణు, వీఆర్‌ఓ బాజీ, సిబ్బంది పాల్గొన్నారు.
చుక్కల దుప్పి చర్మం, తలలు కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్


