టి.నరసాపురం: తండ్రి మందలించడంతో కలుపు మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మొక్కరాల సత్య పవన్‌కుమార్ అల్లంచర్ల రాజుపాలెం గ్రామ శివార్లలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. అతని రెండో కుమారుడు ముక్కరాల లోకేష్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వేసవి సెలవులకు వచ్చి ఏ పనీ లేకుండా తిరుగుతూ సెల్ ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ నెల 8న తండ్రి మందలించడంతో తోటలో ఉన్న కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుని తండ్రి సత్య పవన్ కుమార్ ఫిర్యాదుతో ఎస్సై ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముసునూరు: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు నూజివీడు సీఎస్ డీటీ గుండుబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెనన్స్ అధికారుల ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకుని, నిల్వదారులైన బండారు వందనం, కడలి లక్ష్మణరావులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, క్రిమినల్ కేసులు విధించడంతో పాటు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


