న్యూస్‌రీల్
జిల్లాలో సుమారు 6 వేల మంది..
గుబులు రేపుతున్న సుప్రీం తీర్పు
రేషన్ బియ్యం పట్టివేత
ముసునూరు మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. 8లో u
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులకు ప్రస్తుతం విషమ పరీక్ష ఎదురైంది. 2010వ సంవత్సరానికి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. దాదాపు 16 నుండి 25 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారే ప్రస్తుతం పరీక్షలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించిన తాము, ఇప్పుడు తిరిగి తమను తాము నిరూపించుకోవాలని నిబంధన విధించడాన్ని ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరీక్షల విధానంలో వచ్చిన మార్పులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై తమలో కొందరికి అసలు అవగాహనే లేదని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతోకాలంగా పాఠాలు బోధిస్తున్న తమకు ఇప్పుడు ‘టెట్’ నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెట్ అర్హత సాధించాల్సిందే..
అసలే విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుండి 10వ తరగతి వరకు 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే పలు రకాల యాప్‌ల వినియోగంతో టీచర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు కూడా ‘టెట్’ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో ఒక సబ్జెక్టులో నైపుణ్యం సాధించి, ఆ సబ్జెక్టుపై విద్యార్థులకు పాఠాలు బోధించే తాము.. ప్రస్తుతం అన్ని సబ్జెక్టులు కలిపి నిర్వహించే ‘టెట్’ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనడం దారుణమని వారు వాపోతున్నారు.
ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్
టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించాలంటే: ఓసీ కేటగిరీవారు 60 శాతం మార్కులు, బీసీ కేటగిరీ 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్–సర్వీస్‌మెన్ కేటగిరీ 40 శాతం మార్కులు సాధించాలి. టెట్ పాస్ కావాలంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, చైల్డ్ డెవలప్‌మెంట్, పర్యావరణ శాస్త్రం వంటి అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది. బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్ వంటి సంబంధం లేని సబ్జెక్టులను టెట్‌లో పెట్టడం వల్ల పాస్ కావడం ఎలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్–సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ‘ప్రత్యేక టెట్’ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకూ ఉత్తీర్ణత మార్కులను 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి. లేనిపక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోననే ఆందోళన గురువులను వెంటాడుతోంది. దీనికి తోడు టెట్ పాస్ కాని వారికి పదోన్నతులతో (ప్రమోషన్లు) పాటు నియామకాలు కూడా ఉండవని కోర్టు తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారికి పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో 2010వ సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో ప్రవేశించిన సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ టెట్ నిబంధనను ఉపసంహరించాలని గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించడంతో పాటు, సుప్రీంకోర్టు ఈ నిబంధనను పునఃపరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత మే నెల 29వ తేదీన తుది తీర్పు ఇస్తూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని నొక్కి చెప్పింది. అయితే, గతంలో ఇచ్చిన గడువును మరో ఏడాది పెంచుతూ, అంటే 2028 ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలని కొద్దిగా సడలింపు ఇవ్వడం ఒక్కటే ఉపాధ్యాయులకు స్వల్ప ఉపశమనం కలిగించే అంశం.
సుప్రీంకోర్టు తీర్పుతో గురువుల్లో మళ్లీ మొదలైన టెన్షన్
జిల్లాలో సుమారు 6 వేల మంది టెట్ అర్హత సాధించాల్సిన గురువులు
ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్


