ఉపాధ్యాయుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

ఉపాధ్యాయుల పాత్ర కీలకం శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ మద్దిలో పూజలు మావుళ్లమ్మ హుండీ ఆదాయం లెక్కింపు దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర విశిష్టమైనదని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, గణిత ప్రాథమిక నైపుణ్యాలపై పటిష్టమైన అవగాహన కల్పించగలిగితే వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె నగరంలోని కోటదిబ్బ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాన్ని సందర్శించి శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా పరిస్థితుల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ అత్యంత అవసరమన్నారు. సమగ్ర శిక్ష పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై కూడా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు కోర్స్‌ డైరెక్టర్‌, ఏలూరు మండల విద్యాశాఖాధికారి ఈదుపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

ద్వారకాతిరుమల: వేసవి సెలవులు ముగుస్తున్న నేపధ్యంలో శ్రీవారి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. సాధారణంగా ప్రతి మంగళవారం స్వల్ప సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తారు. అయితే ఈ వారం వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో కల్యాణకట్ట, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, క్యూ కాంప్లెక్స్‌ తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి ఆలయ ముఖ మండపం వద్ద నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమం చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,55,857 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో 2365 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పట్టణంలో వేంచేసియున్న మావుళ్లమ్మ అమ్మవారి హుండీలను దేవస్థానం మంగళవారం లెక్కించారు. 75 రోజులకు రూ.61,06,458 లభించగా, 76.700 గ్రాముల బంగారం, 315 గ్రాములు వెండి అమ్మవారికి హుండీల ద్వారా వచ్చిందని తెలిపారు. కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చాగంటి సురేష్‌ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్‌ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

భీమవరం: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సీడబ్ల్యూఎస్‌ఎన్‌ ఆధ్వర్యంలో మంజూరైన ఉచిత ఉపకరణాలను మంగళవారం సర్వశిక్ష కార్యాలయం వద్ద పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం 326 మంది విద్యార్థులకు రూ. 29 లక్షల విలువైన డిజిటల్‌ హియరింగ్‌ ఎయిడ్స్‌, కమోడ్‌ వీల్‌చైర్స్‌, టీఎల్‌ఎం కిట్టు, ట్రై సైకిల్స్‌ వంటి ఉపకరణాలు పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, సమగ్రశిక్ష అడిషినల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ పి.శ్యామ్‌ సుందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement