1.2 కిలోల బంగారం మాయం | - | Sakshi
Sakshi News home page

1.2 కిలోల బంగారం మాయం

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

కొనసాగుతున్న గోల్డ్‌ ఖాతాల పరిశీలన

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌లో ఖాతాదారుల కుదవ పెట్టిన బంగారం ఇంతవరకూ 1210 గ్రాములు(1.21 కిలోలు) స్వాహా అయినట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ ఖాతాలను పోలీసుల సమక్షంలో బ్యాంకు అధికారులు పరిశీలించారు. మరోవైపు ఖాతాదారులు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంగారు వస్తువుల ఖాతాల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ ఖాతాదారులకు సర్ధిచెప్పారు. రాత్రి పొద్దుపోయే వరకు ఖాతాల పరిశీలన జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున బంగారం మాయం కావడంతో ఖాతాదారులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 2,800 ప్యాకెట్లు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నెల 6న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల(240 గ్రాముల) బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి వరకు విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం వరుసగా టోకెన్‌లు ఇచ్చి ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో చూపించారు. ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం మాయం అయినట్లు గుర్తించారు. లాకర్‌లో ఉన్న బంగారం మాయం అవడంపై బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రయిజర్‌ పాత్ర కీలకం కాగా, గత కొద్ది రోజులుగా అప్రయిజర్‌ బ్యాంకుకు రావడం లేదు. ఖాతాదారులు ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం పొందిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైంది. రెన్యువల్‌ చేసిన ఖాతాల నుంచి కూడా బంగారం మాయమైంది. ఖాతాదారులకు తాము పెట్టిన బంగారం మొత్తం పత్రాలపై చూపించి, బ్యాంకులో ఉండే పత్రాలపై మాత్రం తక్కువ బంగారం చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడి బంగారం తిరిగి చెల్లిస్తామని, తమది ప్రభుత్వ బ్యాంకు అని, బ్యాంకు పూర్తి బాధ్యత వహిస్తుందని, ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement