భూ రికార్డుల స్వచ్ఛతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల స్వచ్ఛతే లక్ష్యం

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

సీసీఎల్‌ఏ జీ జయలక్ష్మి

నూజివీడు: భూ రికార్డుల స్వచ్ఛీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీసీఎల్‌ఏ అండ్‌ రెవిన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జీ జయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని పల్లెర్లమూడి, అన్నవరంలో నిర్వహిస్తున్న రీ సర్వేను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని రైతులను అడిగారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో రీ సర్వే చేస్తున్న విధానం పరిశీలించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పట్టాదార్‌ పాసు పుస్తకంలో భూ యజమాని పేరు, సర్వే నెంబర్‌, విస్తీర్ణం, తదితర వివరాలు సక్రమంగా ఉందీ, లేనిదీ రైతులు పరిశీలించుకోవాలన్నారు. వివరాలలో ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే రెవెన్యూ సిబ్బందికి అందించి, పొరపాటుగా ముద్రించిన వివరాలను తెలియజేస్తే, రెవిన్యూ సిబ్బంది రికార్డులు మరోసారి పరిశీలించి, వాటిని వెంటనే మార్పు చేసి ఇస్తారన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పొరపాట్లు లేని పట్టాదార్‌ పాసు పుస్తకాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ్‌, సబ్‌కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, సర్వే అధికారి అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

ఏలూరు (టూటౌన్‌): రెవిన్యూ సేవలందించే విషయంలో నిర్లిప్తంగా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ జి.జయలక్ష్మి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం రీ సర్వే, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ, పీఆర్‌జీఎస్‌, 22 ఏ కేసుల పరిష్కారం, తదితర రెవెన్యూ అంశాల అమలు తీరుపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలను పాటించి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలన్నారు. రెవెన్యూ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 శాతంగా ఉండాలన్నారు. ఏలూరు జిల్లాలో రెవెన్యూ సేవలలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఏప్రిల్‌ కన్నా మే నెలలో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా నమోదైందని, తహసీల్దార్లు ఆఫీస్‌లో కూర్చుని విధులు నిర్వర్తించడం కాదని, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని, ప్రజల సమస్యలపై అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారితో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల రెండుసార్లు మెగా 22ఏ పరిష్కార మేళాను నిర్వహించి వెయ్యి ఎకరాలకు పైగా భూములను నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించామన్నారు. జిల్లాలో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను నూరు శాతం పంపిణీ చేశామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె.అభిషేక్‌ గౌడ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ దేవకీదేవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement