ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్‌లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాలని, పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. అనంతరం ఈ రాస్తారోకో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణచైతన్య పాల్గొని మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికలు కాగానే ప్రజలపై ధరల భారం మోపారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు బి.సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, కె.విజయలక్ష్మి, సీపీఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్, పి.కన్నబాబు, కురెళ్ల వరప్రసాద్, సీపీఎం నాయకులు పంపన రవి, వై.ఎస్. కనకారావు, జి.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.


