వీఆర్‌ఓల నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓల నిరసన గళం

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

ఏలూరు (టూటౌన్‌): వీఆర్‌ఓ మహ్మద్‌ హుస్సేన్‌ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్‌ఓలు ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్‌ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా వెంకాయపల్లి వీఆర్‌ఓ మహ్మద్‌ హుస్సేన్‌ మరణానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్‌ఓలు, విలేజ్‌ సర్వేయర్లు, వీఆర్‌ఏలపై పనిభారం నానాటికి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తామంతా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజులు, పండుగ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. తమకు కేవలం రెవెన్యూ సంబంధిత విధులు మాత్రమే కేటాయించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడపా రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌వి సుబ్బారావు, జిల్లా కోశాధికారి దామరాజు రవికుమార్‌, నూజివీడు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఏలూరు మండల వీఆర్‌ఓలు కరీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement