ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పనిచేస్తోన్న పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తూ నిబంధనల మేరకు బదిలీలు చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాధారణ బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన సిబ్బందికి సాధారణ బదిలీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టి పెట్టుకుని సిబ్బందికి బదిలీ ఉత్తర్వులు అందజేశారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఖాళీల వివరాలను ప్రదర్శిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ వారు కోరుకున్న స్థానాలను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. పాఠశాలలు, కళాశాలలు తెరిచే సమయం సమీపించిన నేపథ్యంలో బదిలీ ప్రక్రియ పూర్తి చేయటం పట్ల పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ శివకిషోర్ పారదర్శకంగా బదిలీలను పూర్తి చేయటం పట్ల సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీ ప్రక్రియ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


