వైఎస్ అంటే ఎందుకంత కక్ష సాధింపు?
అభ్యంతరం దేనికి?
భీమవరం: భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మను అధికారులు తొలగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ సెంటర్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అంబేడ్కర్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, ప్రకాశం చౌక్ సెంటర్‌లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను గతంలోనే ఏర్పాటు చేశారు.
ఇటీవల ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఎన్టీఆర్, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం విశాలమైన సిమెంట్ దిమ్మను నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా చుట్టూ రక్షణ గోడను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాల మధ్యలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటుకు ఎత్తుగా సిమెంట్ దిమ్మను నిర్మించారు. ఈ పనులు దాదాపు 20 రోజులుగా జరుగుతున్నా, మునిసిపల్ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
వైఎస్ విగ్రహానికి అడ్డంకులెందుకు?
ఇదే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు సంకల్పించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పేరిచర్ల విజయ నర్సింహరాజు, కోడే యుగంధర్, చిరుగుపాటి సందీప్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును క్యాంపు కార్యాలయంలో కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పగా ఆయన అంగీకరించారు. దీంతో శుక్రవారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు దిమ్మను నిర్మించారు. శనివారం ఉదయమే మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో మిగిలిన విగ్రహాల జోలికి వెళ్లకుండా, కేవలం రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మను మాత్రమే తొలగించారు.
ఎవరికీ అడ్డులేని ప్రాంతంలో, ఎమ్మెల్యే అనుమతితో విగ్రహం ఏర్పాటుకు తలపెడితే, మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో దిమ్మను తొలగించడం వెనుక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రోద్బలం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను పాటించాలనుకుంటే మిగిలిన విగ్రహాల ఏర్పాటుకు ఎలా అనుమతినిచ్చారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు ఒక నిబంధన, వైఎస్సార్‌సీపీకి మరొక నిబంధన అమలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారులు జోక్యం చేసుకుని వైఎస్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.
అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దారుణం. ఇప్పటికే ఎన్టీఆర్, ఇతర విగ్రహాలు ఏర్పాటు చేస్తుండగా, వాటికి లేని అడ్డంకులు వైఎస్ విగ్రహానికే ఎందుకు వచ్చాయో మునిసిపల్ అధికారులు సమాధానం చెప్పాలి.
– చిరుగుపాటి సందీప్, వైఎస్సార్‌సీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు
ప్రకాశం చౌక్ సెంటర్‌లో అల్లూరి విగ్రహం ఎప్పుడో ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం కాగా, ప్రకాశం పంతులు విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి ఏ ఇబ్బందీ లేకుండా, రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే దిమ్మను తొలగించడం అన్యాయం. పక్షపాత వైఖరితో వైఎస్ విగ్రహాన్ని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు.
– గాదిరాజు రామరాజు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు
భీమవరంలో వైఎస్ విగ్రహంఏర్పాటుకు అభ్యంతరం
ఎన్టీఆర్, ప్రకాశం పంతులు విగ్రహాల ఏర్పాటుకు చురుగ్గా పనులు
రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు


