స్థానికంగానే ఆక్వా ఉత్పత్తుల అమ్మకం | - | Sakshi
Sakshi News home page

స్థానికంగానే ఆక్వా ఉత్పత్తుల అమ్మకం

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

స్థానికంగానే ఆక్వా ఉత్పత్తుల అమ్మకం

పాలకొల్లులో విక్రయ కేంద్రం ప్రారంభం

మృగశిర కార్తె పురస్కరించుకుని రొయ్య, చేపలతో భోజనాలు

పాలకొల్లు సెంట్రల్‌: గత రెండేళ్లుగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి అరుస్తున్నా, ఫీడ్‌ ధరల పెంపు, ప్రాసెసింగ్‌ ధరల తగ్గింపు వంటి ఇబ్బందులను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిరసనలు, ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, మన దారి మనమే చూసుకోవాలనే దృఢ సంకల్పంతో జై భారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు ఆధ్వర్యంలో సోమవారం పాలకొల్లు పూలపల్లి బైపాస్‌ రోడ్డులో నూతన ప్రాన్‌ డొమెస్టిక్‌ సేల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఫిష్‌ ఆంధ్రా పథకాన్ని విమర్శించిన వారు, నేడు రైతులు సొంతంగా ఇటువంటి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి రావడాన్ని పలువురు గమనిస్తున్నారు. ఆక్వా రైతులు స్థానికంగా మార్కెట్‌ను పెంచుకునేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇక్కడ రొయ్యలు విక్రయించే వారికి సంఘం తరపున ఫ్రిజ్‌లు, రూ. 10,000 పెట్టుబడిని సహాయంగా అందిస్తామని గాంధీభగవాన్‌రాజు ప్రకటించారు. ఆక్వ్రా రైతు సంఘం నాయకులు ఎవరైనా రొయ్యలు విక్రయించాలని అనుకుంటే తాము వారికి సహకరిస్తామని తెలిపారు.

ఈ కేంద్రాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మృగశిర కార్తెలో చేపలు, రొయ్యలు తినడం మన పూర్వీకుల సాంప్రదాయమని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి స్వయంగా కేజీ, అరకేజీ ప్యాకెట్ల రొయ్యలను వినియోగదారులకు విక్రయించి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆక్వా రైతులు పాలకొల్లు, ఆచంట, నర్సాపురంలలో ప్రజలకు చేపలు, రొయ్యల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఫీడ్‌ ధరలు, ప్రాసెస్‌ యూనిట్ల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రాసెసింగ్‌ యూనిట్లు అయినకాడికి దోచుకుంటున్నాయన్నారు. ఫీడ్‌ ధరలు పెంచడంతో ఆక్వా రైతు తలకుమించిన భారాన్ని మోస్తూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని వాపోయారు. మన సాంప్రదాయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ ఆక్వా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వాలు కళ్లు తెరిచేలా ఈ మృగశిర కార్తె రోజున పేద ప్రజలకు రొయ్య, చేపలతో భోజనాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మృగశిర కార్తెతో రుతుపవనాలు మొదలై వాతావరణం చల్లబడుతుందని, శరీరంలో మార్పులు కలిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, చేపలు , రొయ్యలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన విందులో సుమారు ఐదు వేల మంది ప్రజలు పాల్గొని, గోంగూర పచ్చిరొయ్యలు, చేపల పులుసుతో భోజనం చేశారు. ఆక్వా సంఘం నాయకులు బోణం చినబాబు, మేడిది జాన్‌రాజు, సత్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మృగశిర కార్తె భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం

అవుట్‌లెట్‌లో ఆక్వా ఉత్పత్తుల అమ్మకం

Advertisement
 
Advertisement
Advertisement