మరో 350 గ్రాముల బంగారం మాయం | - | Sakshi
Sakshi News home page

మరో 350 గ్రాముల బంగారం మాయం

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

జంగారెడ్డిగూడెం: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్‌లో ఖాతాదారులు బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకోగా, ఖాతాదారులకు సంబంధించిన బంగారం మాయమైంది. ఈ నెల 6న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము కుదువ పెట్టిన బంగారం బ్యాంకులో ఉందా? లేదా చూపించాలని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన కొనసాగగా, బ్యాంకు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని సోమవారం ఖాతాదారులు అందరికీ సంబంధించిన కుదువ పెట్టిన బంగారం చూపిస్తామని చెప్పగా, ఖాతాదారులు వెనుదిరిగారు. సోమవారం ఉదయమే బ్యాంకు వద్దకు వందలాది మంది ఖాతాదారులు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో బ్యాంకు అధికారులు, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఖాతాదారులకు వరుసగా టోకెన్‌లు ఇచ్చి సీరియల్‌ వారీగా ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో ఖాతాదారులకు చూపించారు. ఈ విధంగా సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగగా, ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులను పరిశీలించారు. వాటిలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం ఖాతాదారులు పెట్టిన బంగారం కంటే తక్కువగా ఉందని నిర్ధారించారు. దీంతో ఖాతాదారుల నుంచి ఆ 350 గ్రాముల బంగారానికి సంబంధించి ఫిర్యాదులను తీసుకున్నారు. ఇంకా బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించి చాలా ప్యాకెట్లు పరిశీలించాల్సి ఉందని, ఈ ప్రక్రియ మొత్తం మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 6వ తేదీన 30 కాసులు మాయం కాగా, సోమవారం లెక్కల్లో మరో 350 గ్రాముల బంగారం మాయమైంది. దీంతో మిగిలిన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్యాంకు ఉన్నతాధికారులు విజయవాడ నుంచి వచ్చి ఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రైజర్‌ పాత్ర కీలకమని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతను దొరికితే బ్యాంకులో ఖాతాదారులు పెట్టిన బంగారం ఎలా మాయమైందో తెలుస్తుందని భావిస్తున్నారు. బ్యాంకులో ఖాతాదారులు తాము పెట్టిన బంగారానికి ప్రస్తుతం బ్యాంకు అధికారులు చూపిస్తున్న బంగారానికి వ్యత్యాసం ఉండి తక్కువ బంగారం చూపించడంతో అసలు ఆ బంగారం ఎలా మాయమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement