దేవాలయాలు సున్నితమైన అంశాలు | - | Sakshi
Sakshi News home page

దేవాలయాలు సున్నితమైన అంశాలు

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

ద్వారకాతిరుమల: సోషల్‌ మీడియాలో దేవాలయాల గురించి ప్రచారం చేసేటప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు. కొండపైన పద్మాలయ కల్యాణ మండపంలో సోమవారం ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈఓ త్రినాధరావు మాట్లాడుతూ క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, స్వామివారి సేవలను భక్తులకు మరింత చేరువచేసే విషయంలో సోషల్‌ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ఆలయ అభివృద్ధికి ఇన్‌ఫ్లూయెన్సర్లు సహకరించాలని కోరారు. ఆన్‌లైన్‌ సేవలను విస్తృత పరచాలని, ముఖ్యంగా మన మిత్ర యాప్‌ వినియోగంపై భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఆలయం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేటప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నారు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో సున్నితమైందన్నారు. కవరేజ్‌ కూడా పరిమితులకు లోబడి ఉండాలని సూచించారు. ఆలయంలో వీడియోలు తీయకూడదన్నారు. డ్రోన్‌ కవరేజ్‌ కూడా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో జరగాలన్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. అనంతరం శ్రీగోమాత ప్రొడక్ట్స్‌ వారు సమకూర్చిన శ్రీవారి మెమెంటోలను ఈఓ త్రినాధరావు ఇన్‌ఫ్లూయెన్సర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ డీవీ భాస్కర్‌, డీఈవో వై.భద్రాజీ, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజారావు, వాసు, లక్ష్మీపతి, సూపరింటిండెంట్‌లు, ఏఈలు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, ఏలూరు, దెందులూరు, భీమడోలు, విజయవాడ, భద్రాచలం, అత్తిలి, కామవరపుకోట, దూబచర్ల, అయినవెల్లి తదితర గ్రామాలకు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు.

ఇన్‌ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి

Advertisement
 
Advertisement
Advertisement