చింతంపల్లిలో ఎస్పీ ‘పల్లెనిద్ర’ | - | Sakshi
Sakshi News home page

చింతంపల్లిలో ఎస్పీ ‘పల్లెనిద్ర’

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

చింతంపల్లిలో ఎస్పీ ‘పల్లెనిద్ర’

చింతలపూడి: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడమే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్‌ శాఖ సరికొత్తగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఎస్పీ కె. ప్రతాప్‌ శివ కిషోర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో గడిపారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, యువత భవిష్యత్తు, మత్తు పదార్థాల నివారణ, ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న సైబర్‌ నేరాల పట్ల గ్రామస్తులకు, మహిళలకు అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ఉన్నత విద్య, క్రీడలపై దష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ హితవు పలికారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ యువతతో కలిసి ఆయన వాలీబాల్‌ ఆడారు. ఎస్పీ స్వయంగా కోర్టులోకి దిగి యువకులతో సరదాగా ఆట ఆడటంతో అక్కడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా మారింది. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్‌, చింతలపూడి సీఐ క్రాంతికుమార్‌, ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement