కర్షకులపై కపట ప్రేమ
రోడ్డెక్కిన రొయ్య రైతు
సూపర్ సిక్స్‌తో వంచించి..
నేడు సిద్ధాంతం రాక
సాక్షి, భీమవరం: ‘ఏం తమ్ముళ్లూ.. అధికారంలోకి రావడమే ఆలస్యం.. అవి చేస్తాం.. ఇవి చేస్తాం..’ అంటూ ఎన్నికల్లో హామీల వరద పారించారు చంద్రబాబు. గోదావరిపై వంతెనలు కట్టేస్తానన్నారు.. విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీరు ఇచ్చేస్తానన్నారు.. ఆడబిడ్డకు నిధి అన్నారు.. నిరుద్యోగులకు భృతి అన్నారు.. తణుకులో హైటెక్ టవర్, ఆకివీడులో కోల్డ్ స్టోరేజీలు, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను పట్టాలెక్కించలేదు. సీఎం చంద్రబాబు సోమవారం జి ల్లాకు వస్తుండటంతో ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వా గ్దానాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
● 2024 ఏప్రిల్ 10.. తణుకులోని నరేంద్ర సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తణుకులో హైటెక్ టవర్ నిర్మిస్తానన్నారు. ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తానని, తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, వలసలు అరికడతానని హామీ ఇచ్చారు.
● 2024 మే 10.. ఉండి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల కోసం 500 టన్నులు కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానన్నారు. ఏరియేటర్స్ మీద సబ్సిడీ ఇప్పిస్తానన్నారు. యూనిట్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని పైకి తీసుకువస్తానన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితం కావడంతో విజ్జేశ్వరం నుంచి ప్రొజెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా ఇస్తానన్నారు. ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లైఓవర్ నిర్మిస్తామని హామీల గుప్పించారు. రెండేళ్లు కావస్తున్నా ఇవేమీ కార్యరూపం దాల్చలేదు.
● 2024 జనవరిలో.. ఆచంటలో జరిగిన టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అ యోధ్యలంక–కోడేరు మధ్య గోదావరిపై వారధి నిర్మిస్తామని మాటిచ్చారు.
● కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయినా కేబినేట్‌లో ఆమోదం అంటూ వశిష్ట వారధి నిర్మాణం ఇంకా ప్రకటనలకే పరిమితమైంది. ఏటా వరదల సమయంలో లంక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ఆచంట, పెనుగొండ, పోడూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి దొంగరావిపాలెంలోని కోడేరు బ్యాంకు కెనాల్‌లోకి ఎత్తిపోతల పథకం నిర్మాణం హామీ అటకెక్కిపోయింది. ఆచంట, పోడూరు, పెనుగొండ, యలమంచిలి మండలాల్లోని నక్కల డ్రెయిన్ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి మాట పక్కనపెడితే రెండేళ్లుగా కూటమి నాయకులు డ్రెయిన్ గట్లకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.
రైతును రాజును చేస్తానంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు పాలనలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కొందరికే పరిమితం చేశారు. రైతుల కోసం గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథ కాన్ని ఎత్తివేశారు. నీటి తీరువాను వడ్డీలతో కలిపి వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నా రు. గత ఖరీఫ్‌లో మోంథా తుఫానుతో జి ల్లాలో 9,201 హెక్టార్లలో రూ.23 కోట్ల మేర పంట నష్టం వాటిల్లగా ఇప్పటికి పరిహారం అందక తొలకరి పెట్టుబడుల కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు.
మరోపక్క సీడ్, ఫీడ్, ఎక్స్‌పోర్టర్స్ సిండికేట్ దోపిడీ నుంచి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కూటమి పాలనలో తరచూ జిల్లాలోని ఆక్వా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ అందజేయాలని, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలుచేయాలని, స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తొలి ఏడాది ఎగనామం పెట్టారు. లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతలు పెట్టి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలను మమ అనిపిస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి హామీల అమలు ఊసెత్తడం లేదు. రెండేళ్లలో ఆడబిడ్డ నిధి అందక జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5.96 లక్షల మంది మ హిళలు రూ.2,146 కోట్లు నష్టపోయారు. నెలనెలా ఇస్తామన్న రూ.3 వేల భృతి కోసం జి ల్లాలోని వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతం చేరుకుని గ్రామసభలో పాల్గొంటారు. రైతులతో మాట్లాడి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
బురిడీ బాబూ !
ఎన్నికల్లో జిల్లాకు హామీల వరద పారించిన చంద్రబాబు
విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ తాగునీరు
వశిష్ట గోదావరిపై వంతెనల నిర్మాణం
తణుకులో హైటెక్ టవర్, వలసల నిరోధానికి పరిశ్రమల ఏర్పాటు
ఆక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్
హామీల అమలుపై చిత్తశుద్ధి కరువు
నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక


