అనుమతులివ్వాలి
● అటవీ శాఖ అభ్యంతరాలు
● ఏజెన్సీలో నిలిచిన రోడ్డు నిర్మాణాలు
● ఆందోళనలో గిరిపుత్రులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేక కొండరెడ్డి గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వా లు నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు గ్రామా లు దాటాలంటే కొండలు, గుట్టలు ఎక్కిదిగాల్సి వస్తోంది. తమకు రహదారి కష్టాలు తీర్చాలని మొరపెట్టుకున్నా అటవీశాఖ అధికారులు కనికరం చూ పడం లేదని గిరిజనులు అంటున్నారు. ఇదిలా ఉండగా అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివే దించామని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నా రు. రానున్న వర్షాకాలంలో మరిన్ని తిప్పలు తప్ప వని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
నిలిచిన పనులు ఇలా..
● బుట్టాయగూడెం మండలంలో అలివేరు నుంచి లంకపాకల మీదుగా రేగులపాడు, రేపల్లె గ్రా మాలకు సుమారు 5.7 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 2022–23లో సుమారు రూ.2.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలివేరు నుంచి లంకపాకల మీదుగా గానుగమామిడి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన రోడ్డు పనులు అటవీ మార్గంలో ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు తెలపగా పనులు నిలిచిపోయాయి.
● వేలేరుపాడు, బుట్టాయగూడెం మండలాల సరిహద్దు మారుమూల అటవీ ప్రాంతంలో కొండరెడ్డి గిరిజనులు స్వాతంత్య్రానికి ముందు నుంచి నివసిస్తున్న మోదేలు గ్రామానికి రహదారి ని ర్మాణం కోసం సుమారు రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. విద్యుత్ సదుపాయానికి మ రో రూ.70 లక్షలు మంజురయ్యాయి. అయితే వీ టికి కూడా అటవీ అధికారులు అభ్యంతరం చె ప్పడంతో ఆయా పనులు నిలిచిపోయాయి. అ లాగే ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద 19 కు టుంబాలకు గృహాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కూడా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పగా అవీ నిలిచిపోయాయి.
● మారుమూల గ్రామం రామనర్సాపురానికి కూ డా పీఎం జన్మాన్‌లో నిధులు మంజూరైనా అటవీశాఖ అధికారుల అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి.
● రెడ్డికోపల్లి నుంచి వీరన్నపాలెం గ్రామానికి సుమారు రూ.4.8 కోట్ల అంచనాలతో 4 కిలోమీ టర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలు చెప్పారు.
● ఆయా పనుల కోసం స్థానిక అటవీ అధికారులు పంపుతున్న సర్వే నివేదికలను ఆమోదించకుండా ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్ధ్దాలుగా కొండలపై నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులకు సరైన రహదారి లేక అవస్థలు పడతున్నారు. రోడ్ల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు సర్వేలు చేసి ప్రతిపాదనలు పంపిస్తున్నా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు తెలిపి తిరస్కరించడం బాధాకరం. వర్షాకాలం రానే వచ్చింది. అధ్వానంగా ఉండే రోడ్లపై గిరిజనులు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అటవీ అధికారులు రోడ్డు పనులకు అనుమతులు ఇచ్చేలా కృషి చేయాలి.
– కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం


