వైఎస్సార్‌సీపీ హయాంలో కృషి
సాక్షి, భీమవరం: సిండికేటు దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడుకునే దిశగా ఆక్వా రై తులు అడుగులు వేస్తున్నారు. చేపలు, రొయ్యలకు లోకల్ మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పాలకొల్లులోని జైభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం మృగశిర సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చింది. చేపలు, రొయ్యలతో సోమ వారం ప్రత్యేక భోజనాలు ఏర్పాటుచేసింది.
2.63 లక్షల ఎకరాల్లో..
జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో వనామీ సాగు చేస్తున్నారు. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్స్ ఏకమై ఇష్టానుసారం రొయ్య, చేపల ధరలు తగ్గించేసి, మేత ధరలు పెంచుతూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆక్వా రైతులు వా పోతున్నారు. ఇటీవల ఎక్స్‌పోర్టర్స్ ధరలను తగ్గించడంపై జైభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు పాలకొల్లులో రొయ్యలను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. ఫీడ్ ధరలు పెంపుపై పాలకొల్లు, వీరవాసరం, ఉండి తదితర చోట్ల రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేశారు.
స్థానిక అమ్మకాలు పెంచేందుకు..
రొయ్యల వినియోగంలో ఏడాదికి తలసరి 10 నుంచి 12 కిలోల సగటుతో చైనా ముందుంటే, 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో, ఎనిమిది కిలోలతో యూరోపియన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో సగటు వినియోగం కేవలం 1.5 కిలోలు మాత్రమేనని ఆక్వా వర్గాలంటున్నాయి. స్థానిక వినియోగం పెంచడం ద్వారా సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలన్న యోచనలో రైతులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వివిధ కౌంట్లలోని రొయ్యలను ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తున్నారు. పాలకొల్లులో యూనిట్‌ను ఏర్పాటుచేశారు.
ఉచిత భోజనాలు
మృగశిర కార్తెతో రుతుపవనాలు మొదలవుతాయి. వర్షాలు కురవడంతో తేమ ఎక్కువై జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చేపలు, రొయ్యల్లో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, ప్రొటీన్లు, ఐరన్, జింక్ శ్వాసకోశాన్ని బలంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఈ సీజనన్‌లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం చేపలు, రొయ్యలు తినడం అ నాదిగా వస్తున్న ఆచారం. ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమిస్తున్న జైభారత్ క్షీరారామా ఆక్వా రైతు సంఘం డొమెస్టిక్ సేల్స్ పెంచేందుకు కృషి చేస్తోంది. చేపలు, రొయ్యల్లోని పోషకాలు, ఉపయోగాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మృగశిర కార్తె రోజున ప్రతి కుటుంబం కిలో రొయ్యలు, కిలో చేపలు కొనుగోలు చేయాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా పేదల కోసం సంఘ ప రిధిలోని పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్, ఆచంట నియోజకవర్గం మార్టేరు సెంటర్, నరసాపురం సెంటర్‌లో చేపలు, రొయ్యల వంటకాలతో ఉచిత భోజనాలు ఏర్పాటుచేశారు. స్థానిక వినియోగం పెంపు లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంఘ నాయకులు చెబుతున్నారు.
సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు గత వైఎస్సార్ ప్రభుత్వం కృషి చేసింది. ఫిష్ ఆంధ్రా ద్వారా జిల్లాలో సబ్సిడీపై రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువైన 250కు పైగా ఔట్‌లెట్లు ఏర్పాటుచేశారు. అలాగే ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ రొయ్యలను స్థానిక వినియోగదారులకు డోర్ డెలివరీకి కార్యాచరణ చేశారు. ఎక్స్‌పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలో కౌంట్‌ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేయాలని భావించగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు.
స్థానిక మార్కెట్ వైపు రైతుల చూపు
తెరపైకి మృగశిర సెంటిమెంట్
చేపలు, రొయ్యల ప్రాధాన్యతను వివరిస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం
నేడు పాలకొల్లు, నరసాపురం, ఆచంటలో చేపలు, రొయ్యలతో పేదలకు ఉచిత భోజనాలు
డొమెస్టిక్ సేల్స్‌కు గతంలోనే కార్యాచరణ చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
జిల్లావ్యాప్తంగా 250 ఫిష్ ఆంధ్రా ఔట్‌లెట్స్ ఏర్పాటు


