ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఏపీ ఎన్‌జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆదివారం నగరానికి విచ్చేసిన విద్యాసాగర్‌తో పాటు ప్రధాన కార్యదర్శి డీవీ రమణలను స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు కలిశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, అరకొర జీతాలు తదితర వివరాలను ఎన్‌జీఓ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ పోరాటం చేస్తున్నామన్నారు. దీనిపై విద్యాసాగర్ స్పందిస్తూ త్వరలోనే రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్, రాష్ట్ర సెక్రటరీ కె.నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మధుకాంత్, మెంబర్ సెక్రటరీలు సీహెచ్ రాజేష్, డి.మోహన్, టి.చిరంజీవి ఉన్నారు. వీరికి ఏపీ ఎన్‌జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు మద్దతుగా నిలిచారు.


