కుంచనపల్లిలో ఎయిర్‌పోర్టు? | - | Sakshi
Sakshi News home page

కుంచనపల్లిలో ఎయిర్‌పోర్టు?

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

రాజమహేంద్రవరం తరహాలో నిర్మాణం

ఐదు కిలోమీటర్ల రన్‌వే ప్రతిపాదన

తాడేపల్లిగూడెం: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు తరహాలో, తాడేపల్లిగూడెం సమీపంలోని కుంచనపల్లి గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి త్వరలో ఆమోదముద్ర పడనుంది. విమానయానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరళీకృత వైమానిక విధానాన్ని ప్రకటించింది. గత పదేళ్లుగా పెరిగిన విమాన ప్రయాణాలు, సరుకు రవాణా (కార్గో) ద్వారా వచ్చే ఆదాయాలను విశ్లేషించి, రాష్ట్రాల వారీగా ఉన్న వెసులుబాటు మేరకు నూతన విమానాశ్రయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక రంగంలో సరళీకృత విధానాలను రూపొందించుకుని, సౌలభ్యాలు, వ్యాపార ప్రయోజనాలు, వేగవంతమైన ప్రయాణాల కోసం నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, భూములను కూడా గుర్తించింది. తాజాగా ఎయిర్‌పోర్టు ఫీజిబిలిటీని నిర్ధారించేందుకు కేంద్రం నుంచి వచ్చిన బృందం ప్రతిపాదిత ప్రాంతంలో ఇటీవల పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించిన బృంద సభ్యులు వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతం బహుళ ప్రయోజన గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు సరిపడదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కుంచనపల్లి ప్రాంతంలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు తరహాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు యోచిస్తున్నారు.

కుంచనపల్లిలో ఎయిర్‌పోర్టు

ఫీజిబిలిటీ సూచనల మేరకు, మండలంలోని కుంచనపల్లి ప్రాంతాన్ని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని కోసం సుమారు 1,200 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ ప్రాంతంలో భూములు అందుబాటులో ఉండటం, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వంతెనలు, తోటలు వంటి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ ప్రాంతం ఎంతో అనుకూలమని భావిస్తున్నారు.

ఢిల్లీలో కీలక సమావేశం

తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులు, ఇతర సాంకేతిక అనుమతులు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రానికి ఎయిర్‌పోర్టుకు సంబంధించి కీలక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వెంకట్రామన్నగూడెం ఎందుకు సరికాదు

స్థల సేకరణకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండవనే ఉద్దేశంతో, కేంద్ర వైమానిక శాఖ మంత్రి గూడెం ఎయిర్‌పోర్టును ప్రకటించిన సందర్భంలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతంలో సుమారు 1,100 ఎకరాలను గుర్తించారు. సమీపంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నుంచి అనుమతులు రావడం అంత సులభం కాదు. ఈ కారణంతోనే వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల భూములను గుర్తించారు. ఇక్కడే ఎయిర్‌పోర్టు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఫీజిబిలిటీ కమిటీ వచ్చిన తర్వాత మొత్తం సీన్‌ మారింది. ఏవియేషన్‌ నిబంధనల ప్రకారం ప్రతిపాదిత ప్రాంతంలో విండ్‌ క్లియరెన్స్‌ సరిగా లేదని గుర్తించారు. అంతేకాకుండా, అక్కడ ఉన్న తోటలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఆటంకంగా మారాయి. తొలి ప్రతిపాదనలో రన్‌వే రెండు కిలోమీటర్లు ఉంటే చాలనుకున్నప్పటికీ, డొమెస్టిక్‌, కార్గో విమానాల రాకపోకల కోసం ఎయిర్‌పోర్టును నిర్మిస్తే రన్‌వే కనీసం ఐదు కిలోమీటర్ల వరకు ఉండాలని నిర్ణయించారు. దీంతో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement