ఉండి: మండలంలో మట్టి అక్రమ రవాణా కోసం పంట కాలువలు, పిల్ల కాలువలు, మేజర్, మైనర్ డ్రెయిన్‌లను ఆక్రమించి, అక్రమంగా వంతెనలు నిర్మించి మట్టిని తరలిస్తున్నారు. దీంతో కలిసిపూడి పంట కాలువ గట్టు అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెరుకువాడ, కలిసిపూడి గ్రామాల సరిహద్దులో గతంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు కూడా లేదు. ఇప్పుడు అక్రమ మట్టి రవాణా కోసం తమకు అనుకూలంగా వంతెనకు అప్రోచ్‌ను ఏర్పాటు చేసుకుని, భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు.
జాతీయ రహదారిపైనే అక్రమ అప్రోచ్
వంతెనకు ఏర్పాటు చేసిన ఈ అప్రోచ్ రోడ్డు, జాతీయ రహదారి–165లో ఒకవైపు భాగాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. దానికి తోడు, వంతెన మీదుగా భారీ వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో అప్రోచ్ మట్టి రహదారిపైకి జారిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న చినుకులకు, అప్రోచ్ కోసం వేసిన కంకర మట్టిలా మారి జారిపోతోంది. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ప్రమాదాల నిలయంగా రహదారి
అధిక లోడుతో వెళ్తున్న మట్టి వాహనాల నుంచి పెద్ద పెద్ద మట్టి పెళ్లలు రోడ్డుపై పడుతుండటంతో, వెనుక వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. శనివారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌పై నుంచి మట్టి పెళ్ల పడటంతో, దానిని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడి గాయాలపాలయ్యారు. జాతీయ రహదారిని సగానికి పూడ్చేసినా, ఓవర్‌లోడ్ వాహనాలతో ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు.


