తణుకు అర్బన్: స్థానిక వెంకటేశ్వర థియేటర్ సెంటరులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు తణుకు పట్టణ పోలీసులు తెలిపారు. సుమారు 60 ఏళ్ల వృద్ధుడు గత కొంతకాలంగా అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని, ఆదివారం స్పృహ లేకుండా పడి ఉండగా మరణించినట్లు ధ్రువీకరించామని వారు వివరించారు. తీవ్రమైన వడగాల్పుల వల్లే అతను మరణించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
భీమడోలులో వృద్ధుడి మృతి
భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు రైల్వే స్టేషన్ ఎదురు ఉన్న బస్ షెల్టర్ వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. వృద్ధుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. తొలుత సమాచారం అందుకున్న భీమడోలు 104 సిబ్బంది వచ్చి మృతదేహాన్ని పరీక్షించి మృతి చెందినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు తెలిపారు. భీమడోలులో కొంత కాలంగా యాచన చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పంచాయతీ సిబ్బందికి అప్పగించారు.
ముదినేపల్లి (కై కలూరు): విద్యుత్ షాక్‌కు గురై ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రోవెల్ ఫీడ్స్ ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్ శనివారం రాత్రి మరణించాడు. దీనిపై మృతుని తల్లి అంజలి ఆదివారం ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వడాలి గ్రామానికి చెందిన అనగాని మహంకాళి (20) ఇటీవల ఐటీఐ పూర్తి చేసి, 7 నెలలుగా సదరు ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం బీ–షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తుండగా రాత్రి 8 గంటలకు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ముసునూరు: పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన విషాద ఘటన మండలంలో జరిగింది. యల్లాపురానికి చెందిన సన్నకారు రైతు చీదిరాల సూర్యచంద్రరావు (60), ఆదివారం ఉదయం జీలుగ పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లారు. మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఫ్యూజ్ వద్ద విద్యుత్ ప్రసరించి, షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఎం. చిరంజీవి తెలిపారు.
కాళ్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. కాళ్ల గ్రామానికి చెందిన తాళ్లూరి యాకోబు (17), తన స్నేహితుడు దండే జాషువరాజుతో కలిసి మోటార్ సైకిల్‌పై జ్యూస్ తాగడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, పెంటపాటి నాగేశ్వరరావు ఇంటి వద్దకు రాగానే, భీమవరం నుంచి కలిదిండి వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న యాకోబుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
యలమంచిలి: చించినాడ గ్రామానికి చెందిన పెదపట్నం కిషోర్‌కుమార్ (35) శనివారం రాత్రి చించినాడ వశిష్ట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం ఆదివారం పైకి తేలింది. కిషోర్‌కుమార్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బ్యాంకు పని ఉందని చెప్పి శనివారం ఉదయం కిషోర్ చించినాడ వచ్చాడు. రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తండ్రి శ్రీనివాసరావు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కిషోర్ గోదావరిలో దూకాడు. తండ్రి పెదపట్నం శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్‌రాజు కేసు నమోదు చేశారు.


