నరసాపురం: 85 ఏళ్ల భట్టు ప్రభాకరరావుది దయనీయ పరిస్థితి. విశాఖ కేంద్రంగా నేవీలో 40 ఏళ్లపాటు ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేసి, రెండో ప్రపంచ యుద్ధంలోనూ సేవలందించిన ఆయనకు నేడు కనీసం ప్రభుత్వం కేటాయించిన భూమి కూడా దక్కలేదు. ఉద్యోగ విరమణ అనంతరం, ఆయన సేవలకు గుర్తింపుగా 1969 అక్టోబర్ 13న అప్పటి ప్రభుత్వం నరసాపురం మండలం వేములదీవి సముద్రతీర గ్రామంలోని సర్వే నెంబరు 681/1లో 2.40 ఎకరాల భూమిని పట్టాగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిని రెవెన్యూ అధికారులు ఆయనకు అప్పగించలేదు.
గత 57 ఏళ్లుగా ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభాకరరావు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వృద్ధాప్యంతో గుంటూరులో కుమారుడు ఐజయ్య వద్ద ఉంటున్న ఆయన, ఇప్పటికీ తన భూమి కోసం పోరాడుతున్నారు. ఇటీవల అధికారులు స్పందిస్తూ ఆ భూమిని ఎప్పుడో వేరే వారికి ఇచ్చేశామని చెప్పడంతో ప్రభాకరరావు, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రారంభంలో ఆ భూమి నీళ్లలో ఉండటంతో స్వాధీనం చేసుకోవడం సాధ్యపడలేదని, ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదని ఆయన వాపోతున్నారు.
వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం
నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరప్రాంతంలో ఇదే రీతిలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధులకు, మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు వ్యక్తులు, రెవెన్యూ అధికారుల అండతో తరతరాలుగా అనుభవిస్తున్నారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా నిబంధనలను తుంగలో తొక్కి, అక్రమంగా మ్యూటేషన్లు చేయడం, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లలో నరసాపురం కార్యాలయం వేదికగా అక్రమ మ్యూటేషన్ల జారీ విస్తృతంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిగితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
57 ఏళ్లుగా తిరుగుతున్న
85 ఏళ్ల వృద్ధుడు


