లోసరి చానల్ పరిధిలో తాగునీటికి ఇక్కట్లు
భీమవరం: గుక్కెడు నీళ్ల కోసం లోసరి చానల్ పరిధిలోని గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వేసవి నేపథ్యంలో కాలువలకు నీరు వదిలి వారం రోజులు గడుస్తున్నా, భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై చేపట్టిన వంతెన పనులు పూర్తికాకపోవడంతో, కాలువకు వేసిన అడ్డుకట్ట తొలగించలేదు. దీనివల్ల దిగువ గ్రామాలకు నీటి సమస్య ఏర్పడింది. సుమారు 20 రోజుల క్రితమే పలు గ్రామాల్లోని మంచినీటి చెరువులు అడుగంటడంతో, ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి నీటిని కొనుగోలు చేసుకుని దాహార్తిని తీర్చుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో చెరువుల్లోని నీరు పాచిపట్టి, దుర్వాసన వస్తుండటంతో వాడకానికి కూడా పనికిరాకుండా పోయాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు నీటిని విడుదల చేస్తే తమ సమస్య తీరుతుందని ఆశించిన ప్రజలకు, ఈ వంతెన నిర్మాణ పనులు అడ్డంకిగా మారాయి.
గత ప్రభుత్వ హయాంలో యనమదుర్రు కాలువపై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలిపోయాయి. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేయడంతో, ఏప్రిల్ నెలలో భీమవరం డీఎన్నార్ కళాశాల సమీపంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే, పనులు నత్తనడకన సాగుతుండటంతో నేటికీ కనీసం పిల్లర్ల పనులు కూడా పూర్తికాలేదు. దీనివల్ల గొల్లవానితిప్ప, తోకతిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమూరు, దొంగపండి, లోసరి, గొంది, బర్రెవానిపేట తదితర గ్రామాలకు నీరు చేరక, మంచినీటి చెరువులు నింపుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అడుగంటిన చెరువుల్లోని కలుషిత నీటిని సరఫరా చేయడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేనిపక్షంలో కాలువ నీటిని ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించాలని కోరుతున్నారు.
వంతెన పనుల కారణంగా నీటి విడుదలకు ఇబ్బంది ఏర్పడింది. బెడ్ లెవెల్ పనులను త్వరితగతిన పూర్తి చేయించి, నీటి పారుదలకు ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తాం. రెండు రోజుల్లో అడ్డుకట్ట తొలగించి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటాం.
– అడబాల శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ


