పోలీసుల పనితీరుపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

పోలీసుల పనితీరుపై అవగాహన

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

పోలీసుల పనితీరుపై అవగాహన డివిజన్ల పెంపుపై స్టే ఆర్డర్‌ శ్రీవారి క్షేత్రంలో సినీ నటి శ్రీదేవి సందడి ధ్రువీకరణ పత్రాల పరిశీలన టెట్‌ నిబంధనపై చట్ట సవరణ చేయాలి

దెందులూరు: జిల్లా ఎస్పీ కే.ప్రతాప శివ కిషోర్‌ దెందులూరు బాల సదన్‌కు చెందిన 23 మంది బాలికలను ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు శనివారం ఆహ్వానించారు. పోలీసులు సమాజంలో ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఎస్పీ బాలికలకు వివరించారు. ట్రాఫిక్‌ నిబంధనలపై, మహిళా పోలీసుల పనితీరు గురించి అవగాహన కల్పించారు. బాలికల వ్యక్తిగత భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ అంటే ఏమిటో పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఆధునిక పోలీసింగ్‌ పద్ధతులపై బాలికలకు అవగాహన కల్పించే క్రమంలో, ఎస్పీ డ్రోన్‌ కెమెరాల పనితీరును, నేరాల నియంత్రణలో నిఘాలో వాటి ప్రాముఖ్యతను స్వయంగా చూపించారు. ఉన్నతమైన జీవితాన్ని గడపాలంటే చదువు ఒక్కటే మార్గమని, విద్యార్థి దశ నుండే చదువు పట్ల అంకితభావంతో, ఆసక్తితో ఉండాలని పిల్లలకు దిశానిర్దేశం చేశారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లను 62 డివిజన్లకు పెంచే ప్రక్రియను ఈ నెల 16 వరకు నిలుపుదల చేయాలంటూ హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. డివిజన్ల పెంపుదలకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్‌ బాబులు కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ ప్రకారం ఈ నెల 4న కోర్టు ఏలూరు కార్పొరేషన్‌లో డివిజన్ల పెంపుదల ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని కోర్టు మూవీ ఫేమ్‌ హీరోయిన్‌ శ్రీదేవి శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమె ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, అభిమానులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

నూజివీడు: ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాలలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో రెండోరోజైన శనివారం కొనసాగింది. దీనిలో భాగంగా ఎన్‌సీసీ కోటాలో 487 మందికి 342 మంది, క్యాప్‌ కోటాలో 97 మందికి 69 మంది, స్పోర్ట్స్‌ కోటాలో 164 మందికి 129 మంది కలిపి 748 మంది అభ్యర్థులకు 540 మంది సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పరిశీలించారు. కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్‌, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సర్వీస్‌లో ఉన్న టీచర్లు టెట్‌ పాస్‌ కావాల్సిందేనన్న నిబంధనపై పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) ఏలూరు జిల్లా చైర్మన్‌ పువ్వుల ఆంజనేయులు కోరారు. ఈ విషయమై శనివారం స్థానిక అశోకవర్ధన కార్పొరేషన్‌ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 10 గంటలకు జాక్టో సభ్య సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సర్వీసు టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలంటే చట్టసవరణ ఒక్కటే మార్గమని, అందుకు పార్లమెంట్‌లో విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, చట్టసవరణ జరిగే లోపు సర్వీసులో ఉన్న టీచర్లకు ప్రత్యేకంగా ఏడాదికి రెండు దఫాలు టెట్‌ నిర్వహించాలని తీర్మానం చేశారు. వీటితో పాటు ఉత్తీర్ణత మార్కులు అన్ని కేటగిరీలకు 35 శాతం ఉండాలని, సిలబస్‌లో కూడా మార్పులు చేసి, ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో అదే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలని తీర్మానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement