భీమవరం: శాసనసభ్యుడి అనుమతితో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేపడితే, మున్సిపల్ అధికారులు నిర్మాణంలో ఉన్న విగ్రహం దిమ్మెను తొలగించారని వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఇప్పటికే వివిధ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయగా, మరికొన్ని ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా తాము కూడా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించి, ఎమ్మెల్యే అంజిబాబు దృష్టికి తీసుకెళ్లగా ఏర్పాటుకు అభ్యంతరం లేదనడంతో శుక్రవారం దిమ్మ నిర్మాణం చేపట్టారు. శనివారం ఉదయమే మున్సిపల్ అధికారులు జేసీబీతో దిమ్మను తొలగించడంతో, పార్టీ నాయకులు కలెక్టరేట్‌లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాయుడు మాట్లాడుతూ, ప్రకాశం చౌక్ సెంటర్‌లో అన్ని విగ్రహాలతో పాటే రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు సంకల్పించామన్నారు. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో అభ్యంతరం లేదని స్పష్టం చేశారని, ఆ మేరకు విగ్రహం ఏర్పాటుకు దిమ్మ నిర్మాణం చేపట్టగా, మున్సిపల్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దిమ్మను తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలవెల్లి మంగ, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పార్టీ నాయకులు కోడే యుగంధర్, గుంటి ప్రభు, బోకూరి విజయరాజు, కాటం స్టాన్లీ పాల్గొన్నారు.


