బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్‌లో 30 కాసులు మాయం
జంగారెడ్డిగూడెం: బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమ ఆభరణాలను చూపించాలంటూ ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకోవడంతో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. శనివారం ఒక ఖాతాదారుడు తన రుణాన్ని పూర్తిగా చెల్లించి, తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి కోరారు. ఆయన తాకట్టు పెట్టిన 9 కాసుల బంగారానికి బదులుగా, బ్యాంకు సిబ్బంది కేవలం 6 కాసుల బంగారం మాత్రమే ఇచ్చారు. మిగిలిన 3 కాసుల ఆభరణాల గురించి ప్రశ్నించగా, ఇదే క్రమంలో మరో ఇద్దరు ఖాతాదారులు తమ బంగారాన్ని చూపించాలని పట్టుబట్టారు. సదరు ఖాతాదారుల ఆభరణాలను పరిశీలించగా, మొత్తం 30 కాసుల బంగారం తక్కువగా ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఖాతాదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బ్యాంకు అప్రైజర్ రాజు గత రెండు రోజులుగా విధులకు హాజరుకావడంలేదని, అతనే ఈ 30 కాసుల బంగారాన్ని గోల్‌మాల్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో మిగిలిన ఖాతాదారులు సైతం ఆందోళన చెంది బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో ఆడిట్ జరుగుతోందని, సోమవారం అందరికీ వారి ఆభరణాలను చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి వెనుదిరిగారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లు సిబ్బంది వెల్లడించారు.


