ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు ముగుస్తుండటంతో వేలాది మంది భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ ఆవరణలో పలు కోలాట భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సైతం భక్తులతో రద్దీగా మారింది. బస్సులు ఎక్కేందుకు భక్తులు పోటీ పడ్డారు.


