మృత్యుపాశాలు.. లో లెవెల్‌ కాజ్‌వేలు | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశాలు.. లో లెవెల్‌ కాజ్‌వేలు

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

మృత్యుపాశాలు.. లో లెవెల్‌ కాజ్‌వేలు

వంతెనలు నిర్మించాలి

వర్షాలకు దెబ్బతిని ప్రమాదకరంగా మారిన లో లెవెల్‌ కాజ్‌వేలు

వంతెనలు నిర్మించాలని ప్రజల డిమాండ్‌

నూజివీడు : నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల పరిధిలో వాగులపై ఉన్న లోలెవెల్‌ కాజ్‌వేలు, చప్టా, కల్వర్టులు ప్రమాదభరితంగా తయారయ్యాయి. వర్షాకాలంలో వచ్చిన వరదలకు తోడు, తుపాను ప్రభావానికి కురిసిన వర్షాలకు వాగులు పొంగడంతో వాటికి సమీపంలో రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న కల్వర్టులు, కాజ్‌వేల వద్ద మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రధానంగా రెయిలింగ్స్‌ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. నూజివీడు మండలంలో రామిలేరు, ఊటవాగులు ప్రవహిస్తున్నందున వానాకాలంలోను, తుపాన్ల సమయంలోను ఈ వాగులకు వరదనీరు పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో ఈ వాగులపై ఉన్న రోడ్లపైకి పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహించి రాకపోకలు సైతం స్తంభించిపోతాయి.

ఎటుచూసినా పొంచి ఉన్న ప్రమాదం

● రామిలేరుపై ఉన్న కల్వర్టులు, కాజ్‌వేలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది.

● పోతురెడ్డిపల్లి రోడ్డులో నూజివీడు పట్టణ పరిధిలోని ఊటవాగుపై ఉన్న కాజ్‌వేకు గతంలోనే భారీ రంధ్రం పడగా తాత్కాలికంగా పూడ్చారు.

● అలాగే జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, మీర్జాపురం–కాట్రేనిపాడు, పోతురెడ్డిపల్లి–సింహాద్రిపురం మార్గంలో ఉన్న లోలెవెల్‌ కాజ్‌వేలు సైతం దెబ్బతినడమే కాకుండా రెయిలింగ్స్‌ లేవు. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు తుక్కులూరు వద్ద ఉన్న లోలెవెల్‌ కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రహహించడంతో ఆ ప్రవాహంలో యువతి వాగులోకి కొట్టుకుపోయి మరణించింది. అప్పట్లో ఈ కాజ్‌వేను జిల్లా కలెక్టర్‌ కే వెట్రిసెల్వీ పరిశీలించి ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడారు. వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సూచించినా ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

● నూజివీడు మండలంలోని దంతులవారిగూడెం–మర్రికుంట గ్రామాల మధ్య ఊటవాగుపై చప్టా ఉండగా 2024 ఆగస్టు 31న వచ్చిన వరద ఉధృతికి చప్టా అంతా కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తూ స్థానికులు కిందపడి గాయాలపాలవుతున్నారు.

● ఆగిరిపల్లి మండలంలో నూగొండపల్లి వద్ద ప్రవహించే కుంపిణీపై వాగుపై ఉన్న వంతెనకు రెయిలింగ్స్‌ లేక ప్రమాదభరితంగా ఉంది. ఈ వాగుకు వరద ఎక్కువగా వస్తుంది. ఈ వంతెనపై గతంలో రెండుసార్లు మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి.

● తోటపల్లి–చిన్నాగిరిపల్లి మధ్య ఉన్న లోలెవెల్‌ కాజ్‌వే సైతం ప్రమాదభరితంగా ఉంది. ఇక్కడ కూడా గతంలో వరద వచ్చినప్పుడు వ్యక్తి గల్లంతై మృతదేహం కూడా దొరకలేదు.

మంత్రిగారు పట్టించుకోరు

నియోజకవర్గానికి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా పూర్తికాకపోవడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోలెవెల్‌ కాజ్‌వేలు, చప్టాలు ప్రమాదభరింతగా మారినా వాటి మరమ్మతులకు ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మంత్రిగారు స్పందించి ప్రమాదభరితంగా ఉన్న లోలెవెల్‌ కాజ్‌వేలను, చప్టాలను, కల్వర్టులకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

నూజివీడు మండలం దంతులవారిగూడెం–మర్రికుంట గ్రామాల మధ్య వరదలకు దెబ్బతిన్న చప్టా, తుక్కులూరు–కాట్రేనిపాడుల మధ్య ప్రమాదభరితంగా లో లెవెల్‌ కాజ్‌వే

రామిలేరులో వరద ప్రవాహం అత్యంత వేగంగా ఉంటుంది. వరదలు వచ్చేటప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎవరైనా కాజ్‌వేలు, చప్టాలు దాటడానికి ప్రయత్నిస్తే వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. గతేడాది సెప్టెంబరులో వచ్చిన వరదకు తుక్కులూరుకు చెందిన యువతి వరదలో కొట్టుకపోయి మృతిచెందింది. ప్రమాదభరితంగా ఉన్న కాజ్‌వేల స్థానంలో ప్రభుత్వం వెంటనే వంతెనల నిర్మాణం చేపట్టాలి.

– పాలడుగు విజయ్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు, తుక్కులూరు

Advertisement
 
Advertisement
Advertisement