తాడేపల్లిగూడెం: రైతులకు, స్వయం సహాయక బృందాలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశేష సేవలందిస్తోందని రీజినల్ మేనేజర్ ఈ.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం పట్టణంలోని కల్యాణ మండపంలో బ్యాంక్ అగ్రికల్చరల్ మెగా అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించింది. ఆర్‌ఎం మాట్లాడుతూ విజయవాడ రీజియన్‌లో ఈ ప్రోగ్రాం కింద రూ.125 కోట్లు మంజూరు చేయగా, పశ్చిమ రీజియన్‌లో తాడేపల్లిగూడెం, తణుకు, అర్ధవరం, భీమవరం, పైడిపర్రు, చిననిండ్రకొలను, జంగారెడ్డిగూడెం, ఏలూరు బ్రాంచిలలో ఇతోఽధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు బ్యాంకు అందించే సేవల గురించి ఆయన వివరించారు. మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. బ్యాంక్ మేనేజర్ తోట వివేకానంద, సీనియర్ మేనేజర్ నరేష్, ఏబీఎం బాలరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పెనుగొండ: ఈ నెల 9న సిద్ధాంతంలో జరగనున్న సీఎం పర్యటనను ఒకరోజు ముందుకు అంటే 8వ తేదీకి మార్పు చేసినట్లు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం విలేకరులకు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమన్వయ కర్త పెందుర్తి వెంకటేష్‌తో కలిసి కలెక్టరు చదలవాడ నాగరాణి పర్యవేక్షించారు. సీఎం చేతులమీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే రైతులకు ముందుగా సమాచారం అందించాలన్నారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు తాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. . ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. సమీక్షలో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ, జేసీ టి రాహుల్‌కుమార్ రెడ్డి, ఆర్డీవోలు దాసిరాజు, కే ప్రవీణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2023–24 సంవత్సరం ఇన్‌స్పైర్ మనక్ అవార్డుల నామినేషన్‌కి సంబంధించి ఏలూరు జిల్లా నుంచి 8 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ, జిల్లా సైన్స్ అధికారి సోమయాజులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 75 ప్రాజెక్టులు అప్లోడ్ అవ్వగా ఆన్‌లైన్‌లో పరీక్షించి 8 ప్రాజెక్టులు ఎంపిక చేశామన్నారు. న్యాయనిర్ణేతలుగా ఎం.లావణ్య, ఎం. శ్రీనివాస్, పారుల్ సింగ్ వ్యవహరించారు. రాష్ట్రస్థాయి పోటీలు జరిగే తేదీ, వేదిక త్వరలో తెలియజేస్తారు.


