● రూ.10 లక్షల ఆస్తి నష్టం
● రెండు ఫైర్ ఇంజన్‌లతో మంటలు అదుపు
తణుకు అర్బన్ : తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తేతలి – సత్యవాడ రోడ్డులోని సూర్యప్రభ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని గోడౌన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో తణుకు ఫైర్ ఆఫీసర్ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల తీవ్రత పెరుగుతుండడంతో అత్యవసరంగా అత్తిలికి చెందిన మరో అగ్నిమాపక వాహనాన్ని రప్పించి సుమారు 5 గంటల పాటు శ్రమించి చివరకు మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గోడౌన్‌లో ఉన్న నెయ్యి నిల్వలతోపాటు ప్యాకింగ్ మెటీరియల్, విలువైన సామాగ్రితోపాటు ఒక కారు, బుల్లెట్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గోడౌన్ కూలిపోగా ఆస్తి నష్టం సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అగ్నిమాపక అధికారి ఐ.అజయ్‌కుమార్ తెలిపారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇన్‌న్‌చార్జి ఎస్‌సై జానా సతీష్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేదారశెట్టి సుధ పేరుతో ఉన్న గోడౌన్‌లో మానేపల్లి వెంకట రామగోపాల్‌కు చెందిన నెయ్యి, ఇతర సామాగ్రి ఉన్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గోడౌన్‌కు ఎటువంటి అనుమతులు లేవని, వాస్తవానికి విరుద్ధంగా మరొక పేరుతో ఈ గోడౌన్ నడుస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


