ఏలూరు (టూటౌన్): విద్యార్థులు వేసవిలో సమయం వృథా చేయకుండా విజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకునే దిశగా కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ రావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణ, సమ్మర్ క్యాంపు విద్యార్థుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో నిర్వహించారు. సభలో గుడిపాటి నరసింహారావు రిటైర్డ్ లెక్చరర్ పి ఆంజనేయులు, కేవీ నారాయణరావు, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వై నిర్మల మాట్లాడుతూ ఇంగ్లీషు భాష, ఉపన్యాసం, సులభ గణితం, కంప్యూటర్ కోర్సులు రెగ్యులర్‌గా నిర్వహించడానికి కార్యక్రమం రూపొందిస్తామన్నారు. 15 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంపులో విద్యార్థులు ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు.
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. రాణి మేకల చుక్కమ్మ అనే వృద్ధురాలు కొండపై ఉన్న సగర్ల కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆమె నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో ఇంటికి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు మంటలలో చిక్కుకున్న చుక్కమ్మను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, వంట సామాగ్రి, దుస్తులు, నిత్యవసర వస్తువులు కాలి బూడిదైనట్లు బాధితురాలు వాపోయింది. గ్రామస్తులు జూలూరు కోటేశ్వరరావు, రేషన్ డీలర్ వేణుగోపాల్, యండురి సుధీర్ నిత్యావసర వస్తువులు, రూ.5 వేల నగదును తహసీల్దార్ ప్రసాద్ చేతుల మీదుగా బాధితురాలు చుక్కమ్మకు అందజేశారు.
తల్లీ కుమార్తె అదృశ్యంపై కేసు
జంగారెడ్డిగూడెం: తల్లీ కుమార్తె అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టణానికి చెందిన కె.రాంబాబు, అతని భార్య ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాంబాబు ఈ నెల 5వ తేదీ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి, భార్య, 11 ఏళ్ళ కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో రాంబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.


