చింతూరు: సీలేరు నదిలో పడి ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా బొమ్మిడికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన 13 మంది విహారయాత్ర నిమిత్తం చింతూరు ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి కల్లేరు సమీపంలోని సీలేరు నది వద్దకు వెళ్లారు. ఇందులో కొందరుస్నానానికి నదిలోకి దిగగా, తేజ అనే బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోతున్న క్రమంలో సబ్బవరపు ఆనంద్ (37) అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో స్థానికులు నదిలోకి దూకి తేజను రక్షించారు. అనంతరం ఆనంద్‌ను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీటిలో గల్లంతు కాగా, కొంతసేపటికి సమీపంలోని నది వద్ద పొదల్లో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడు విద్యుత్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న చింతూరు ఎస్సై సంతోష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


